లోక్‌సభలో మాట్లాడుతున్న అధిర్ రంజన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను చొరబాటుదారులంటూ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ స్తంభించింది. ఇలాంటి వాఖ్యలను సహించబోమని, అధిర్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ చొరబాటుదారు. అందుకే ఆ పార్టీకి ఇతరులు కూడా చొరబాటుదారులు మాదిరిగానే కనిపిస్తున్నారు’అంటూ మండిపడింది. అధిర్ వ్యాఖ్యలపై సోమవారం లోక్‌సభలో అధికార ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు అధిర్ ప్రయత్నించగా చొరబాటుదారు అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు.
‘అవును. నేను చొరబాటుదారునే. మోదీ, అమిత్ షా, ఎల్‌కే అడ్వాణీ కూడా చొరబాటుదారులే’అంటూ అధిర్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధిర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని తెలిపినా బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. సోమవారం రాజ్యసభ సమావేశమైన వెంటనే బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్ అధిర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘ప్రధాని, హోం మంత్రిపై చొరబాటుదారులు వంటి మాటలను వాడే హక్కు ఏ పార్టీ నేతకైనా ఉందా? ఇది దేశ పార్లమెంటరీ ప్రజాసామ్యాన్ని కించపరచడం కాదా?’అని అన్నారు. అధిర్ వ్యాఖ్యలను సభ ఖండించాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment