
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో నవశకం మొదలైంది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్యా ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వర్లి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. అయితే విజయం మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం శివసేన భవన్‌కు చేరుకొని తల్లిదండ్రులతో కలిసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కేవలం సైనికుడిని మాత్రమేనని తెలిపారు. శివసేన అధినేత, తన తండ్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల మేరకు పనిచేస్తానని, మహారాష్ట్ర అభివృద్దిలో భాగంగా అయన ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని ఆదిత్యా ఠాక్రే స్పష్టం చేశారు.
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ తనకు దేవుడితో సమానమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నతనం నుంచే జాక్సన్ అంటే అమితమైన ఇష్టమని, చిన్నప్పుడు ఓ సారి అయనను కలిశానని గుర్తుచేశారు. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇక తన తల్లిదండ్రుల ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్లు తన తల్లికి చెప్పగానే ఆప్యాయంగా కౌగిలించుకొని కష్టపడి పని చేయమని చెప్పిందన్నారు. ఇక ఆదిత్య ఠాక్రే నామినేషన్ వేసినప్పట్నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అందరి దృష్టి ఆయనపైనే ఉన్న విషయం తెలిసిందే. ఇక కూటమిలో భాగంగా సీఎం పదవి శివసేనకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ శివసేనకే సీఎం పీఠం అప్పగిస్తే.. సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది రెండు మూడ్రోజుల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment