తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆపద్ధర్మ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో 1985లో నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. అప్పుడు హిందూపురం, గుడివాడ నుంచి కూడా ఆయన ఎన్నికయ్యారు. వెంటనే నల్లగొండ, గుడివాడ సీట్లకు ఎన్టీఆర్ రాజీనామా చేసి హిందూపురం శాసనసభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1989 డిసెంబర్) ఆయన హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేశారు. ఈ తెలంగాణ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన తెలంగాణ నుంచి అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1989 తర్వాత 29 ఏళ్లకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు (మనవరాలు) సుహాసిని పోటీ చేస్తుండటం విశేషం. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నుంచి టీడీపీ టికెట్‌పై ఆమె పోటీచేయడం ద్వారా తాత తర్వాత తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికల రంగంలోకి దిగిన నందమూరి కుటుంబసభ్యురాలిగా గుర్తింపు పొందారు.
తొలి తరమంతా.. మహామహులే!
నగర రాజకీయాల్లోని తొలితరం నాయకులంతా ఉన్నత విద్యావంతులే. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన వారే నాడు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థ ప్రజాసేవకు పూనుకున్నారు. హైదరాబాద్ స్టేట్‌కు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి ప్రముఖ వైద్యులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్ సాధించిన జీఎస్ మెల్కొటే విజయం సాధించగా, చాదర్‌ఘాట్ నుంచి ప్రముఖ న్యాయ కోవిదుడు గోపాలరావు ఎక్బోటే ఎన్నికయ్యారు. అనంతరం.. ఎగ్బోటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. బేగంబజారు నుంచి ప్రముఖ న్యాయవాది కాశీనాథ్‌రావు వైద్య విజయం సాధించగా, సోమాజిగూడ నుంచి నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కీలక బాధ్యతలు చూసిన మెహిదీ నవాజ్ జంగ్ విజయం సాధించారు. ఫత్తర్‌గట్టి నుంచి సంఘసేవకురాలు మాసుమా బేగం తొలి ఎన్నికలోనే భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఏపీలో కూడా వీరిలో కొందరు వివిధ మంత్రివర్గాల్లోనూ పనిచేశారు.
కమలానికి కలిసొచ్చిన స్థానం
పూర్వపు హిమాయత్‌నగర్ స్థానానికి 1983లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర గెలిచారు. మళ్లీ 1985 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షాల మద్దతుతో ఆయన గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు చేతిలో ఓడిపోయారు. 1992 ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే మళ్లీ నరేంద్ర ఎన్నికయ్యారు. తర్వాత 1994, 99 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సి.కృష్ణాయాదవ్ గెలిచారు. 2004లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి గెలిచారు. 2008 పునర్విభజనతో ఇది అంబర్‌పేటగా మారింది. వరుసగా 2009, 2014లో కిషన్‌రెడ్డి (బీజేపీ) గెలుపొందారు. మళ్లీ అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ (టీఆర్‌ఎస్) పోటీచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment