
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన కోశాధికారిగా సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న మోతిలాల్ వోరా... కొత్తగా సృష్టించిన పరిపాలనా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పటేల్ గతంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 1996–2000 మధ్య కాలంలో కూడా ఏఐసీసీ కోశాధికారిగా విధులు నిర్వర్తించారు.
పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ సంస్థాగత పదవుల్లో కొన్ని మార్పులు చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మని కరణ్‌సింగ్ స్థానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌గా ఎంపికచేశారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితురాలిగా ఎంపికయ్యారు. లియుజిన్హో ఫాలేరియో ఈశాన్యరాష్ట్రాల(అస్సాం మినహా) ఇన్‌చార్జీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
నిధుల సమీకరణలో ఆయనే కీలకం..
గాంధీ కుటుంబానికి విధేయుడైన 70 ఏళ్ల అహ్మద్ పటేల్ సుమారు 18 ఏళ్ల తరువాత మళ్లీ ఏఐసీసీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. తరుముకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు, పార్టీ నిధుల కటకటతో అల్లాడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మితభాషి, మృదుస్వభావిగా పేరున్న పటేల్ తెర వెనక నుంచే వ్యవహారాలు చక్కదిద్దడంలో దిట్ట. 2004–14 మధ్య సోనియాకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన సమయంలోనే ఆయన తన సమర్థతను చాటుకున్నారు.
ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు పటేల్ కీలకం కానున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్లను పక్కనపెట్టి, యువకులకే పెద్దపీట వేస్తున్నారని వినిపిస్తోంది. రాహుల్‌కు సన్నిహితుడైన కనిష్కసింగ్‌కు కోశాధికారి పదవి కట్టబెడతారని ఊహాగానాలు వినిపించినా, అవన్నీ తప్పని తేలింది.