
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు బుధవారం ఏఐసీసీ వార్ రూమ్‌లో భేటీ అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని, ఈ లోపే క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుందని భేటీలో నిర్ణయించారు.
గత నెలలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతలో ఇంకా వెనకబడే ఉన్నామని పలువురు ప్రస్తావించారు. ఎన్డీయేను అధికారం నుంచి దింపేందుకు అవసరమైన వ్యూహాలపై భేటీలో చర్చించారు. అయితే, విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడం బీజేపీకి లాభించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ప్రస్తావించిన ఖర్గే, అహ్మద్ పటేల్ తదితర నేతలు వాటిని అధిగమించేందుకు పలు సూచనలు చేశారు.
కీలక రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుపై ఒక అవగాహన, స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు, రాష్ట్రాల్లోని పీసీసీలకు మధ్య సమన్వయం అవసరమని పలువురు సూచించారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ‘ఏక వ్యక్తి సైన్యం’లా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన సంస్థాగత బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, పార్టీలో రాష్ట్రాల వారీగా సీనియర్లు, యువ నేతల మధ్య సయోధ్యకు, సహకారానికి రాహుల్ ప్రయత్నించాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు విజయావకాశాలు బలంగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment