రాయని డైరీ | Guest Column By Madhav Singaraju On Congress Leaders | Sakshi
Sakshi News home page

రాయని డైరీ

Published Sun, Aug 11 2019 1:16 AM | Last Updated on Sun, Aug 11 2019 1:19 AM

Guest Column By Madhav Singaraju On Congress Leaders - Sakshi

ఆర్టికల్‌ 370 రద్దు మీద స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చెయ్యడానికి అంతా కూర్చొని ఉన్నాం. గులామ్‌ నబీ ఆజాద్, పి.చిదంబరం ఆర్టికల్‌ 370 హిస్టరీ గురించి చెప్పారు. 
‘త్రీసెవెంటీ హిస్టరీ మాకు తెలుసు. ప్రెజెంట్‌ ఏమిటో చెప్పండి’ అన్నారు పంజాబ్‌ స్టేట్‌ చీఫ్‌ సునీల్‌ జాఖడ్‌. 
ఆజాద్‌ ఆయన వైపు అసహనంగా చూసి, ‘మీరు ప్రెజెంట్‌లోనే ఉన్నారా?’ అని అడిగారు. 
‘ప్రెజెంట్‌లోనే ఉన్నాను. ఎట్‌ ప్రెజెంట్‌ కాంగ్రెస్‌లోనే ఉన్నాను. చెప్పండి. మీరేం చెబితే అది వినాలని ఉంది’ అన్నారు జాఖడ్‌.
ఆజాద్‌ని ఆగమన్నట్లు చూసి...
‘నేను చెప్పొచ్చా జాఖడ్‌జీ ప్రెజెంట్‌ ఏమిటో..’ అన్నారు చిదంబరం.
‘ఎవరు చెప్తే ఏంటి? చెప్పాల్సింది చెప్పాలి గానీ’ అన్నట్లు చూశారు జాఖడ్‌.
‘త్రీసెవెంటీకి ప్రెజెంట్‌ లేదు. కశ్మీర్‌కు ఫ్యూచర్‌ లేదు’ అని చెప్పారు చిదంబరం. 
‘నేనడిగింది త్రీసెవెంటీ ప్రెజెంటూ, కశ్మీర్‌ ఫ్యూచరూ కాదు. మన పార్టీ ప్రెజెంట్‌ ఏమిటని! మన ప్రెజెంట్‌ ఏమిటో తెలిస్తే, మన ఫ్యూచర్‌ ఏంటో కూడా తెలుస్తుంది’ అన్నారు జాఖడ్‌. ఆయనెందుకో సమావేశం మొదలైనప్పట్నుంచీ ఉత్సాహలేమితో బాధపడుతున్నారు. ఆజాద్‌కి ముందే చెప్పాను. ‘సీడబ్ల్యూసీ సమావేశాన్ని నలుగురైదుగురితో కానిచ్చేద్దాం. స్టేట్‌ ప్రెసిడెంట్‌లు, జనరల్‌ సెక్రటరీలు వద్దు’ అని. ‘వాళ్లందర్నీ కలుపుకుంటేనే నలుగురైదుగురు అవుతున్నారు రాహుల్‌జీ’ అన్నారు ఆయన! 
‘త్రీసెవెంటీపై మన స్టాండ్‌ ఏమిటో ఆల్రెడీ పార్లమెంటులో చెప్పేశాం కదా. పార్లమెంటులో చెప్పాక కూడా, మళ్లీ మనకి మనం మన స్టాండ్‌ ఏమిటో చెప్పుకోవడం ఏమిటి? చెప్పు కోడానికి ఈ మీటింగ్‌ ఏమిటి?’’ అన్నారు జాఖడ్‌. 
ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, వేణు గోపాల్‌.. జాఖడ్‌ వైపు చూశారు. ఆ చూడ్డం నిశితంగా, పరిశీలనగా ఉంది. అంత నిశితంగా ఏం పరిశీలిస్తున్నారు జాఖడ్‌లో! జాఖడ్‌ని చూశాక నా వైపు చూశారు. కాంగ్రెస్‌కు ఎట్టకేలకు ఒక కొత్త అధ్యక్షుడు దొరికాడు అన్నట్లుగా ఉంది వారి చూపు! 
కాంగ్రెస్‌లో ప్రశ్నించినవాళ్లు పాత అధ్యక్షులు అయినట్లు గుర్తుంది కానీ, కొత్త అధ్యక్షులు అయినట్లు గుర్తు లేదు మరి!  

‘పార్లమెంట్‌లో మన స్టాండ్‌ ఏమిటన్నది అందరికీ తెలిసిందే జాఖడ్‌. పార్టీలోని వారికే పార్టీ స్టాండ్‌ ఏమిటో తెలియాలి. అందుకే ఈ మీటింగ్‌. మనలోనే కొందరు త్రీసెవెంటీ రద్దును సమర్థిస్తున్నారు. మిగతా కొందరు ఆ సమర్థించే వాళ్లను సమర్థిస్తూ, రద్దును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక పార్టీలో ఉన్నవాళ్లంతా ఒక స్టాండ్‌ మీద లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మీటింగులు తప్పవు’ అన్నారు ఆంటోనీ. 
జాఖడ్‌ ప్రశ్నించడం మానలేదు. ప్రశ్నిం చాలనుకున్న వారందరి ప్రతినిధిగా ఆయన సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చినట్లున్నారు. 

‘‘ఇప్పుడీ త్రీసెవంటీ సమావేశం తర్వాత మన రిలీజ్‌ చెయ్యబోయే స్టేట్‌మెంట్‌.. పార్టీలో అంతా ఒకే మాట మీద ఉండాలనా, పార్టీలో ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉన్నా పర్వా లేదనా?’’ అని అడిగారు జాఖడ్‌. 
‘ఎవరికి వారిగా ఉంటూనే అందరూ ఒకే పార్టీగా ఉండాలని రాహుల్‌ బాబు ఆశిస్తున్నారు’ అని, నా వైపు చూశారు అహ్మద్‌ పటేల్‌. ఆయనతో నేనెప్పుడు ఆ మాట అన్నానో నాకు గుర్తుకు రావడం లేదు! 
‘‘ఎవరికి వాళ్లుగా ఉండేవాళ్లు ఒకే పార్టీగా గానీ, ఒకే పార్టీలో గానీ ఎందుకు ఉంటారు పటేల్‌జీ? కన్‌ఫ్యూజన్‌లో బీజేపీలోకి వెళ్లిపోతారు’’ అన్నారు జాఖడ్‌. పార్టీలో డెమోక్రసీ కన్నా కన్‌ఫ్యూజన్‌ ఎక్కువైనట్లుంది! కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోగానే పార్టీకి డెమోక్రసీ అవసరమా, కన్‌ఫ్యూజన్‌ అవసరమా అనే దానిపై తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement