AICC Screening Committee
-
కాంగ్రెస్ ‘వార్ రూమ్’ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలు బుధవారం ఏఐసీసీ వార్ రూమ్‌లో భేటీ అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, చిదంబరం, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఫిబ్రవరి తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని, ఈ లోపే క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుందని భేటీలో నిర్ణయించారు. గత నెలలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నద్ధతలో ఇంకా వెనకబడే ఉన్నామని పలువురు ప్రస్తావించారు. ఎన్డీయేను అధికారం నుంచి దింపేందుకు అవసరమైన వ్యూహాలపై భేటీలో చర్చించారు. అయితే, విపక్ష కూటమిపై స్పష్టత రాకపోవడం బీజేపీకి లాభించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను ప్రస్తావించిన ఖర్గే, అహ్మద్ పటేల్ తదితర నేతలు వాటిని అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. కీలక రాష్ట్రమైన యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుపై ఒక అవగాహన, స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌కు నష్టం చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హైకమాండ్‌కు, రాష్ట్రాల్లోని పీసీసీలకు మధ్య సమన్వయం అవసరమని పలువురు సూచించారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ‘ఏక వ్యక్తి సైన్యం’లా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన సంస్థాగత బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, పార్టీలో రాష్ట్రాల వారీగా సీనియర్లు, యువ నేతల మధ్య సయోధ్యకు, సహకారానికి రాహుల్ ప్రయత్నించాలన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు విజయావకాశాలు బలంగా ఉన్న హరియాణా లాంటి రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాల్సి ఉందన్నారు. -
ఆ 32 సీట్లు బీసీలకేనా..?
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు 32 స్థానాల్లో అవకాశం వస్తుందా? ఈ స్థానాల్లో పోటీచేసే బీసీ ఆశావహుల జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి చేరిందా? ఆయా స్థానాల్లో ఒక్కొక్కరి చొప్పున నేతల పేర్లు షార్ట్‌లిస్ట్ అయిన మాట వాస్తవమేనా?.. ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెం దిన నేతలకు అవకాశమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపారంటూ ఓ జాబితా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ జాబితా ప్రకారం ఉమ్మడి కరీంనగర్లో 3, ఖమ్మంలో 2, వరంగల్‌లో 2, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 5, నల్లగొండలో 2, మహబూబ్‌నగర్‌లో 1, ఆదిలాబాద్‌లో 3, రంగారెడ్డిలో 6, హైదరాబాద్‌లో 5 స్థానాలు బీసీ నేతలకు ఇస్తున్నట్లు ఆ జాబితాలో ఉంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇందులో యాదవులకు అత్యధికంగా 10, మున్నూరుకాపులకు 8, గౌడ్లకు 6, పద్మశాలీలకు 2, లింగాయత్‌లకు 2, విశ్వకర్మ, ముదిరాజ్, మేదరి, లోధా కులానికి చెందిన ఒక్కో నేత పేర్లు జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో పేర్కొన్న స్థానాల్లో దాదాపు 90 శాతం టికెట్లు ఖరారవుతాయని కొందరు అంటుండగా, అది కేవలం కొందరు వ్యక్తిగతంగా తయారుచేసిందని, ఇందులో ఎక్కువ మందికి సీట్లు దక్కే అవకాశం ఉన్నా, కనీసం ఏడెనిమిది చోట్ల అటు సామాజిక వర్గాలతో పాటు ఇటు నేతల పేర్లలో కూడా మార్పులుంటాయనే చర్చ జరుగుతుండటం గమనార్హం. -
యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి ధీమాగా చెప్పారు. ఎన్నికల తరువాత తాను తిరిగి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి వస్తానన్నారు. గురువారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి వీస్తోందన్నది మీడియా సృష్టేనని, ఎక్కడా ఆ ప్రభావం లేదన్నారు. సీమాంధ్రలో కేవలం చంద్రబాబు మాత్రమే మోడీ గాలి అంటూ భ్రమల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల తరువాత పరిస్థితులను అనుసరించి ఎవరెటు వెళ్తారో దాన్ని బట్టి మూడో ఫ్రంట్ ఉనికిలోకి వస్తుందన్నారు. దేశంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.