సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా అహ్మద్ పటేల్‌ను నియమించడం వెనక పెద్ద మతలబే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్థికంగా నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏడాదిలోగా పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండడమే కాకుండా ఈ ఏడాది చివరలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సినవే. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భారీ ఎత్తున పార్టీకి నిధులు సమీకరించాల్సి ఉంది. 20 ఏళ్ల క్రితం పార్టీక కోశాధికారిగా పనిచేసిన అహ్మద్ పటేల్ సోనియా గాంధీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెల్సిందే.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అహ్మద్ పటేల్, ప్రభుత్వానికీ, పార్టీకి వారధిగా పనిచేశారు. ఆయనకు పార్టీ దిగువస్థాయి కార్యకర్త నుంచి అధిష్టానం నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మరోపక్క కార్పొరెట్ ప్రపంచంతో పరిచయం ఉండడమే కాకుండా కార్పొరెట్ దిగ్గజాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అపార పార్టీ నిధులు కలిగిన భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో అంతంత మాత్రం నిధులతో ఎదుర్కోవడం కష్టమని భావించే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి పదవికి పటేల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న మోతీలాల్ వోరాకు గత కొన్నేళ్లుగా నిధుల సమీకరణలో సహకరిస్తూ పరోక్ష కోశాధికారిగా పనిచేశారని, ఇప్పుడు అధికారికంగా కోశాధికారి అయ్యారని పార్టీ ఆఫీస్ బేరర్ ఒకరు వ్యాఖ్యానించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి నిధుల కొరత ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెల్సి అప్పటి వరకు ఆ పార్టీ వెంట ఉండి విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ ప్రముఖులు బీజేపీ వైపు మళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం అవడంతో పార్టీ నిధుల పరిస్థితి బాగా దిగజారింది.
ఆ పార్టీ ప్రస్తుతం పంజాబ్, మిజోరమ్, పుదుచ్ఛేరిలో మాత్రమే అధికారంలో ఉండగా, కర్ణాటకలో సంకీర్ణ భాగస్వామి అధికారంలో కొనసాగుతోంది. ఈ కారణంగా ఆర్థిక వనరుల సమీకరిణకు అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణకు పార్టీ నాయకులపైనే ఆధారపడుతోంది. నిధులను సామర్థ్యం ఉన్న కారణంగానే మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కమల్‌నాథ్‌ను పార్టీ నియమించింది. ఇదే కారణంగా ఒడిశా పీసీసీ చీఫ్‌గా మళ్లీ నిరంజన్ పట్నాయక్‌ను పార్టీ మళ్లీ నియమించింది. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల నుంచి నిధుల సమీకరణకు గత మూడేళ్లుగా మోతీలాల్ వోరా చేసిన ప్రయత్నించలేదు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు బూటు’ ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అంబానీకి మోదీ ప్రభుత్వం మేలు చేసిందంటూ కార్పొరెట్ దిగ్గజాల లక్ష్యంగా రాహుల్ విమర్శలు చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment