సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆలిండియా ఇన్‌స్టీట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని కేంద్ర, కటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకాష్ నడ్డా అన్నారు. పలు ఆటంకాల కారణంగా నిర్మాణ పనులకు జాప్యం కలుగుతుందని రాజ్యసభకు తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణ జాప్యానికి గల కారణాల గురించి మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్డు ఎయిమ్స్ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాంతంలో ఉండటం, అలాగే ఎయిమ్స్ నిర్మాణానికి కేటాయించిన భూములను వ్యవసాయ భూముల నుంచి సంస్థ భూములుగా బదలాయించడంలో జరిగిన జాప్యం కారణంగా భవన నిర్మాణ పనులు మందగతిన సాగుతున్నట్లు మంత్రి చెప్పారు.
ఎయిమ్స్ నిర్మాణ ప్రాంతంలో రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో చేసిన ప్రతిపాదనను రద్దు చేయవలసిందిగా పలుమార్లు కోరిన మీదట జూన్ 2018లో ఏపీసీఆర్డీఏ అనుమతించినట్లు మంత్రి చెప్పారు.ఎయిమ్స్ నిర్మాణాలను ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారమే సెప్టెంబర్ 2020 నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
తొలి దశ కింద ఓపీడీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పనులను సెప్టెంబర్ 2017లో ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 45 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. రెండో దశ కింద హాస్పిటల్, అకడమిక్ క్యాంపస్ నిర్మాణ పనులను మార్చి 2018లో ప్రారంభించగా ఇప్పటి వరకు 14 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు 231 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా అందులో 156 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment