
సాక్షి, కడప : టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ నేత, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోకర్ లాంటి దివాకర్ రెడ్డితో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ ఇప్పుడు ఆ మహానేత కుటుంబాన్నే విమర్శిస్తుంటే ప్రజలు సహించరని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆకేపాటి హెచ్చరించారు.
ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు ఒక పెద్ద మాయలాంటిదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. టీడపీ, బీజేపీలు మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.