
సతీశ్‌కుమార్, బిజేంద్రసింగ్, అజిత్ బలియాన్
ద్వితీయ బ్రిటిష్–మరాఠా యుద్ధానికి అలీగఢ్ ప్రత్యక్ష సాక్షి. భారతదేశం మొత్తంలో బహుశా మహమ్మద్ అలీ జిన్నా ప్రస్తావన కలిగిన ఏకైక నియోజకవర్గం ఈ పార్లమెంటు స్థానమే కావడం విశేషం. ఇటీవల కాలంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో తలెత్తిన వివాదాలు కావచ్చు, స్థానిక ప్రజల చైతన్యం కావచ్చు ఈ పార్లమెంటు స్థానంపై ఇటు బీజేపీ, అటు మహాగఠ్ బంధన్.. రెండూ పట్టు సంపాదించేందుకు చాలా కాలంగా యత్నిస్తున్నాయి.
బీజేపీకే పట్టం..
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో అలీగఢ్ ఒకటి. స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పర్యాయాలు అలీగఢ్ ప్రజలు పట్టంగట్టింది కూడా బీజేపీకే. ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి సతీష్ కుమార్ గౌతమ్ ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో షీలాగౌతం బీజేపీ నుంచి నాలుగుసార్లు ఇదే పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, గఠ్‌బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్.. బీజేపీ అభ్యర్థి సతీష్‌కుమార్ గౌతమ్‌తో తలపడి తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. బీజేపీని నాలుగుసార్లు విజయతీరాలకు చేర్చిన షీలాగౌతమ్‌ను 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిన బీజేంద్రసింగ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ– గఠ్‌బంధన్ మధ్యనే ఉండబోతోంది.
సిట్టింగ్‌పై అసంతృప్తి..
నిజానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సతీష్‌కుమార్ గౌతమ్ అభ్యర్థిత్వంపై బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్.. సతీష్‌కుమార్‌కు తిరిగి సీటు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. అయితే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మహ్మద్ అలీ జిన్నా ఫొటోని పెట్టడంపై చెలరేగిన వివాదంలో సతీష్‌కుమార్ గౌతం కీలక భూమిక పోషించడం ద్వారా బీజేపీని ప్రసన్నం చేసుకుని, తిరిగి ఈ సీటుని పొందగలిగారు. 2014లో మోదీ వేవ్‌తో ఈ స్థానాన్ని 3 లక్షల ఓట్లతో కైవసం చేసుకోగలిగినా పెద్ద నోట్ల రద్దు ప్రభావం, జీఎస్‌టీపై వ్యతిరేకత, స్థానిక సామాజిక సమీకరణలు బీజేపీ–మహాగఠ్ బంధన్ ఎన్నికల యుద్ధాన్ని పతాక స్థాయికి చేర్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సామాజిక సమీకరణల ప్రభావం
బీజేపీ అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైతే, ఆయనతో ఢీ అంటే ఢీ అంటోన్న మహాగఠ్ బంధన్ అభ్యర్థి అజిత్ బలియాన్ జాట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తోన్న చౌధరీ బీజేంద్రసింగ్‌ది సైతం ఇదే సామాజిక వర్గం కావడం విశేషం. ‘‘ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ అగ్రకులాల ఓట్లన్నీ బీజేపీ పొందగలుగుతుంది. అయితే స్థానిక దళితుల్లోని మెజారిటీ ఓట్లూ, ఓబీసీల ఓట్లూ, జాట్ల ఓట్లు, ఠాకూర్లు, ముస్లింల ఓట్లు మాత్రం మహాగఠ్ బంధన్ ఉమ్మడి అభ్యర్థికే పడతాయి’ అని స్థానిక ఉపాధ్యాయుడు రాఘవేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం అలీగఢ్‌లో 18.5 లక్షల ఓట్లున్నాయి. ఇందులో 20 శాతం ముస్లింల ఓట్లు.
జాట్లు, ఠాకూర్లు కలిపి 15 శాతం ఉంటారు. బ్రాహ్మణులు, వైశ్యుల ఓట్లు కలిపి 10 నుంచి 15 శాతం ఉంటాయి. మిగిలిన వారిలో లోధ్, బఘేల్, సెయినీ, కుమ్మర్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓట్లూ, జాట్లు, ఠాకూర్లు, ఓబీసీలూ, దళితుల్లో కొన్ని వర్గాల మద్దతుతో విజయాన్ని సాధిం చారు. ఈసారి సాధారణ యువతరం అంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతోంటే, విద్యావంతులూ, అలీగఢ్ యూనివర్సిటీ ఘటనల నేతృత్వంలో విద్యార్థులూ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి ఇక్కడ విజయావకాశాలు ఎవరిని వరిస్తాయనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment