విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
చీరాల: ‘‘అధికారం కోసం ఎంతటి నీచస్థాయికైనా సీఎం చంద్రబాబు దిగజారుతారు. ఇది నేను స్వయంగా చూశాను. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో గెలుపుకోసం సీఎం నీచస్థాయికి దిగారు. అ సమయంలో నాటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీయడానికి నీచానికి దిగారు. అక్కడ ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రోజాతో భన్వర్‌లాల్‌కు అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు ప్రచారం చేయాలని నాడు ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జులుగా వ్యవహరించిన నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ఈ మేరకు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఆదేశించిన నీచుడు చంద్రబాబు’’అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నిజం కాదంటే నార్కో పరీక్షలకైనా సిద్ధం కావాలన్నారు. లేదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెప్పాలని ఆయన సవాలు విసిరారు. ఆదివారం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలోని తన నివాసంలో ఆమంచి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మహిళలతోపాటు మనుషులకు కనీస గౌరవం ఇవ్వడని, ఆయన సామాజికవర్గానికి తప్ప మిగిలిన వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వరని, రాజకీయాలకోసం ఎంతటి నీచస్థాయికైనా దిగజారుతారని దుయ్యబట్టారు.
నంద్యాలలో గెలుపుకోసం నీచస్థాయికి దిగారు
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపుకోసం చంద్రబాబు నీచస్థాయికి దిగారని ఆమంచి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 55 మందిని ఇన్‌చార్జులుగా నియమించారని, అందులో ఐదుగురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేల్లో తాను కూడా ఉన్నానని వివరించారు. ఈ క్రమంలో రోజూ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తమతో మాట్లాడేవారన్నారు. నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఉప ఎన్నికలో టీడీపీకి సహకరించడం లేదని, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కోపంతో ఉన్న చంద్రబాబు ఆయన్ను దెబ్బతీసేందుకు ఏకంగా భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టాలని, ఆ మేరకు నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారం చేయాలని స్వయంగా తమను ఆదేశించారని తెలిపారు.
ఆ సమయంలో తనతోపాటు మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డిసహా ఐదుగురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారన్నారు. అయితే అటువంటి ప్రచారం చేసేందుకు తాము అంగీకరించలేదని తెలిపారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎంత నీచ రాజకీయాలకు పాల్పడతారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇది నిజం కాదంటే చంద్రబాబు తన మనవడు దేవాన్ష్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని ఆమంచి ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు చంద్రబాబు సిద్ధం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment