నామినేషన్ల దాఖలుకు మరొక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత, హీరో అంబరీష్ పోటీకి నో అంటున్నారు. ఆరోగ్య కారణాలను ఇందుకు చూపుతున్నా, ఆయనకు పార్టీ సీనియర్లతో తీవ్ర పొరపొచ్చాలే వచ్చినట్లున్నాయి.
సాక్షి, బెంగళూరు:ప్రతిష్టాత్మక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు పెద్ద సంకటం వచ్చిపడింది. మండ్య నుంచి పోటీ చేసే విషయం ఎటూ తేల్చకుండా కాంగ్రెస్‌పార్టీకి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారిన రెబల్‌స్టార్ అంబరీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్దరామయ్యకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయమై అంబరీశ్‌కు సన్నిహితుడైన సందేశ్ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అంబరీశ్ ఇష్టపడడం లేదని చెప్పారు. తనకు బదులుగా తాము సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని, అంబరీశ్‌అటువంటి డిమాండ్లు ఏవీ పార్టీ ముందు పెట్టలేదని చెప్పారు. ఈ విషయాలపై సోమవారం సాయంత్రానికి అంబరీశ్ స్వయంగా మీడియాకు వెల్లడించే అవకాశం ఉందన్నారు.
భేటీకి సీఎం విఫలయత్నం
కాగా మండ్య నుంచి పోటీ చేసే విషయమై అంబరీశ్‌తో మాట్లాడడానికి సీఎం సిద్ధరామయ్య అర్ధగంట పాటు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఆదివారం మైసూరులో ఓ హోటల్‌లో బస చేసిన అంబరీశ్ ఆదివారం సీఎం సిద్ధరామయ్యను ఆయన ఇంట్లోనే కలుసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావించాయి. అంబరీశ్ నగరంలోనే ఉన్నట్లు తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య హెచ్.డీ.కోటలో ప్రచార కార్యక్రమాలను త్వరగా ముగించి మైసూరుకు చేరుకొని అంబరీశ్ కోసం అర్ధగంట పాటు ఎదురు చూశారు. అయితే అంబరీశ్ మాత్రం బెంగళూరుకు వెళ్లిపోవడంతో సిద్ధరామయ్య ఉసూరంటూ ప్రచారానికి పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment