విజయవాడ సిటీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని భక్షించిన చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి రక్షిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి శాకాహారం భజన చేస్తే ఎవరు నమ్ముతారన్నారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారా అని ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదని... చంద్రబాబే ప్రమాదంలో ఉన్నారని చెప్పారు.
విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలతో వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు.. ఆయనకు ప్రమాదం రాబోతుందనే భయంతో ఎవరినైనా కలుస్తారని విమర్శించారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమన్నారు.
వైఎస్సార్ సీపీపై కోడికత్తి పార్టీ అంటూ చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని, అందుకే టీడీపీని శునకానంద పార్టీ అనాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే పరామర్శించాలని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. నీతిలేకుండా చంద్రబాబు, రాహుల్ కలిస్తే ‘జాతీయ ప్రయోజనాలు కోసం కలిశారంటూ’ ఎల్లోమీడియా డప్పు వాయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే ఒక నేతలా కాకుండా హాస్యనటుడిలా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. గత్యంతరం లేక టీడీపీతో కాంగ్రెస్ జతకడుతోందని, కాంగ్రెస్ వాదులు ఇప్పుటికైనా ఆలోచించుకోవాలని సూచించారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీని వీడిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ అపవిత్ర కలయికపై టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆలోచించుకోవాలన్నారు. పాతాళంలోకి జారిపోతున్న కాంగ్రెస్ పార్టీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాపాడి అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. మహాకూటమిగా ఏర్పడిన చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించి 33 ఎంపీ సీట్లు ఢిల్లీకి ఇచ్చి మన్మోహన్ ప్రధాని కావడానికి డాక్టర్ వైఎస్సార్ ప్రధాన కారకుడయ్యారని చెప్పారు. టీడీపీని చంద్రబాబు గంగలో కలుపుతున్నారని.. ఆ పార్టీకి ఇవే చివరి రోజులని అన్నారు.
రాష్ట్రంలో భక్షణ.. ఢిల్లీలో రక్షణా?
Published Mon, Nov 5 2018 3:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment