![Ambati Rambabu Fires On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/18/VRB_7227.jpg.webp?itok=EPfgaMTG)
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనను కొత్తగా ముంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో బాబు కుటుంబం మొత్తం మునిగిపోయిందని, ఇప్పుడు వరదల్లో ఏకంగా ఆయన నివాసం మునిగిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా బాధ్యత కలిగిన వ్యక్తిగా కృష్ణా నదీ గర్భంలోని అక్రమ కట్టడం నుంచి ఖాళీ చేసి వెళ్లడం మంచిదని హితవు పలికారు. అంబటి శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయిన వేళా విశేషంతో రాష్ట్రానికి జలకళ వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
టీడీపీ నేతలవి చౌకబారు ప్రకటనలు
‘‘రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం తన ఇల్లు ముంచేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు. వరదలపై టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిం చినట్లుగా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంటే ఆయన హైదరాబాద్‌లో ఉండి ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లడ్ లెవల్ 22.6 మీటర్లు ఉంటుంది. చంద్రబాబు నివాసం 19 మీటర్ల లోపే ఉంది. నీటిమట్టం మరింత పెరిగితే ఆయన నివాసం మునిగిపోయే అవకాశం ఉంది. నదిలో వరద ఉధృతిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తే అందులో కుట్ర ఏముంది? బ్యారేజీ గేట్లకు పడవలు అడ్డం పెట్టారని అనడం చంద్రబాబు స్థాయికి తగినది కాదు.
బాబుకు అమరావతిపై నమ్మకం లేదా?
వరద తీవ్రత పెరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అందులో భాగంగానే చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇచ్చారు. చట్టప్రకారం వీఆర్‌ఓ నోటీసు ఇవ్వడానికి వెళితే లోనికి రానివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. గతంలో సీఎంగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి చెప్పే సమాధానం ఇదేనా? హై సెక్యూరిటీ జోన్‌లో ఉండే వ్యక్తి మునిగే ప్రాంతంలో నివాసం ఉండటం ఏంటి? చంద్రబాబు అద్భుతంగా అమరావతిని నిర్మిస్తున్నానని చెప్పారే గానీ ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకోలేదు. బాబుకు అమరావతిపై నమ్మకం లేదా? ఇక్కడ ఉండాలనే కోరిక లేదా? అమరావతిలో ఉండకుండా వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఇల్లు నిర్మించుకోలేదని భావిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment