సాక్షి, అమరావతి: ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పేరు మీద సర్క్యులేట్ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబుతో పాటు కె.పార్థసారథి, జోగి రమేశ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. (రాజకీయ కోణం బట్టబయలైంది: అంబటి)
ఎన్నికలు వాయిదా వేసే ముందు ఈసీ ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన దుయ్యబాట్టారు. ఈసీని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. కరోనా వైరస్ గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ లేఖ ఉందని ఆయన ఆగ్రహించారు. చంద్రబాబు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలనే ఈ లేఖలో రాశారని అంబటి మండిపడ్డారు. (ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి: వెల్లంపల్లి)
ఈ లేఖను టీడీపీ కార్యాలయం నుంచి ఐదు టీవీ చానల్స్ ప్రతినిధులకు ఇచ్చారని అంబటి అన్నారు. ఎవరెవరికి ఈ లేఖలు అందాయో తమకు స్పష్టంగా తెలుసని అంబటి తెలిపారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేష్ ఈ-మెయిల్ నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చేరిందన్నారు. ఈ లేఖ వాస్తవమా? కాదా? అనేది నిమ్మగడ్డ రమేషే స్పష్టం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతుంటే, ఇది వాస్తవమా? కాదా? అని చెప్పే బాధ్యత నిమ్మగడ్డ రమేష్‌కు లేదా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్న బాబుకు నిమ్మగడ్డ రమేష్ వత్తాసు పలుకుతున్నారనే భావన తమకు కలుగుతుందని అంబటి రాంబాబు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment