
సాక్షి, అమరావతి: టీడీపీ మత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను కోల్పోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తన పాలనలో కాపుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
► కాపుల్లో వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం రూ.4,770 కోట్లు ఖర్చు చేశారు.
► కాపు మహిళల కోసం వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించి రూ.354 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.
► కాపులకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఐదేళ్లలో బాబు ప్రభుత్వం కాపులపై ఎంత రాక్షసంగా ప్రవర్తించిందో వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది.
► ఏటా కాపుల సంక్షేమానికి రూ.1,000 కోట్లు ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ వాగ్దానం నెరవేర్చలేదు. పవన్.. బాబును ఎందుకు ప్రశ్నించలేదో కాపులకు సమాధానం చెప్పాలి. కాపుల కోసం ఐదేళ్లలో బాబు రూ.1,874.67 కోట్లే ఖర్చు చేశారు.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాపులకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కోరుతున్నారు. బాబు హయాంలో పవన్ ఇలా ఎందుకు కోరలేదు?
► ముద్రగడను అరెస్ట్ చేయించి, వారి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినప్పుడు కాపు పెద్దలందరం కలిసి మీడియా ముందుకు వచ్చాం. ఆ రోజు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?
Comments
Please login to add a commentAdd a comment