పవన్ కల్యాణ్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానాలు చేసుకోవడం తనను కలచి వేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో అంటకాగిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఇప్పుడు బయటకు వచ్చి టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబులానే పవన్ మాట్లాడుతున్నారని, ఆయన లానే ఈయన కూడా తనకు తానే ఉత్తముడని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో ఉంటే సభను ఒక ఊపు ఊపేవాడినని పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని అంబటి రాంబాబు పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇస్తానంటే పోటీ చేయలేదని చెబుతున్న పవన్, సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా? అని నిలదీశారు. రివాల్వర్‌తో కాల్చుకుని చావాలనుకున్నానని పవన్ సభల్లో చెబుతున్నారని, జీవితంతో పోరాడలేక చావాలనుకున్న ఓ వ్యక్తి నిజంగా ధైర్యవంతుడా? అని ప్రశ్నించారు.
‘ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ ఎందుకు పోటీ చేయలేదు?. ప్రజారాజ్యం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ఏం చేశారు?. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. అవిశ్వాసానికి మద్దతుగా ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగడతానన్నారు. అసలు ఏ పార్టీనైనా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని పవన్ కోరారా?. మీ వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే ఎందుకు భయపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మీపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పవన్ తన మాటలను కంట్రోల్ చేసుకోవాలి.’ అని అంబటి రాంబాబు పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment