![TDP and Jana Sena alliance utter flop - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/18/rambabu.jpg.webp?itok=TfnvU9rK)
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన పొత్తును తటస్థులే కాదు.. జనసేన కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని తేల్చిచెప్పారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానేనంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల కలయికను ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వ ఖజానాను దోచేస్తూ.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగ చంద్రబాబు స్కిల్ స్కాంలో దొరికిపోయి జైలుపాలు కావడంతో ఇన్నాళ్లకు ధర్మం, న్యాయం గెలిచిందని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పొంది, తద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలనే నెపంతో టీడీపీ నేతలు కృత్రిమంగా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు స్పందించడంలేదన్నారు. పవన్‌కళ్యాణ్ జనసేన ప్రాణం తీయగలడేమోగానీ టీడీపీకి ప్రాణం పోయలేడంటూ సెటైర్లు వేశారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని.. ఆ ప్రజాబలంతోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలను బంగాఖాఖాతంలో కలిపి తిరుగులేని విజయం సాధిస్తారని తేల్చిచెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..
- టీడీపీ–జనసేన పొత్తు నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకున్నామని పవన్ చెప్పడం పచ్చి అబద్ధం. తొలి నుంచి వారు కలిసే వస్తారని మేం చెబుతున్నాం. అదే నిజమైంది.
- రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నైతిక విలువల్లేనివాడు, నమ్మకూడని వ్యక్తి పవనే. బీజేపీతో పొత్తులో ఉంటూ ఆ పార్టీకి చెప్పకుండా టీడీపీతో పొత్తు ప్రకటించడం హేయం.
- పోటీచేసిన రెండుచోట్ల ఓడి.. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్న నువ్వెక్కడ? ప్రజాబలంతో 151 సీట్లను గెలుచుకున్న సీఎం జగన్ ఎక్కడ? నువ్వెంత? నీ స్థాయి ఎంత పవన్? సీఎం జగన్‌పై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు.
- ఎంపీడీ (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్) అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న నువ్వా సీఎం జగన్‌పై మాట్లాడేది. మనోహర్ కొంగు పట్టుకుని సముద్రంలో కలవడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment