
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాసనమండలి జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మండలి ఉండాలా? లేదా? అనే చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీడీఆర్‌ఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి నివేదించిన అంశంపై ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు మండలి గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.
‘శాసనమండలి గ్యాలరీలో చంద్రబాబు ఉన్నారని తెలిసి.. నేను కూడా ఆసక్తిగా వెళ్లాను. నిబంధనల ప్రకారం మండలిలో బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని భావించా. కానీ చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ఆశ్చర్యంగా అనిపించింది. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే సవరణలు ప్రవేశపెట్టాలి కానీ, వాటిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓటింగ్ జరుగుతుందని భావించాం. కానీ, నిబంధనలకు విరుద్ధంగా చివర్లో చైర్మన్ విచాక్షణాధికారం అంటూ సెలెక్ట్ కమిటీకి పంపించారు. వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడప్పుడే చట్టం కాకూడదనే కుట్రతోనే సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి నివేదించడం వల్ల రెండు, మూడు నెలల జాప్యం జరుగుతుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎంతకాలం ఆపగలరు’ అని అంబటి ప్రశ్నించారు.
రైతులను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. శాసనసభ అమరావతిలో జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. వ్యవస్థలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి నిరోధకంగా శాసనమండలి మారుతున్నప్పుడు దాని కొనసాగింపుపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment