పాట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తంగా ఆదివారం రాష్ట్రంలో వర్చువల్ ర్యాలీని బీజేపీ తలపెట్టింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ర్యాలీకి సుమారు లక్ష మందికిపైగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే తలపెట్టిన ఈ వర్చువల్ ర్యాలీ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లేనని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తెలిపారు. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
కాగా.. వర్చువల్ ర్యాలీపై ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దేశం మొత్తం కరోనా మహమ్మారి బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉంటే బీజేపీ ఎన్నికల కోసం ఆరాటపడుతోందని విమర్శిస్తున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నితీష్ కుమార్‌తో కలిసి మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవిళ్లూరుతోంది. కాగా.. బిహార్‌లో బీజేపీని మొదటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేఎస్‌పీ) కూడా వలస కూలీల విషయంలో సీఎం నితీష్ పనితీరును బాహాటంగానే విమర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌షా చేపట్టిన వర్చువల్ ర్యాలీ తమ కూటమి ఐక్యతను చాటిచెప్పేందుకేనని తెలుస్తోంది.
అయితే గత ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాయి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జేడీయూ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment