
అమిత్ షా (ఫైల్ ఫోటో)
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన పర్యటనను ముమ్మరం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రణళికలను సమీక్షించేందుకు అమిత్ షా మంగళవారం కేరళలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలతో, రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె. రాజశేఖరన్‌ను అనూహ్యంగా మిజోరం గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
గతంలో కేవలం ఆరు శాతమే ఉన్న బీజేపీ ఓట్లశాతం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికలలోపు రాష్ట్రంలో మరింత బలపడాలని కమళదళం ప్రయత్నిస్తోంది. ప్రధాన మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేనాతో (బీడీజేఎస్) కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనుంది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌గోపాల్ ఒక్కరు మాత్రమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా సీపీఎం నేతృత్వంలోని (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని(యూడీఎఫ్) బలంగా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏవిధమైన వ్యూహం అమలు చేస్తుందో వేచి చూడాలి.