ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌ | BJP Leader Amit Shah Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌

Published Fri, Apr 26 2024 5:35 AM | Last Updated on Sat, Apr 27 2024 12:31 AM

BJP Leader Amit Shah Fires On Congress Govt

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.

అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని విమర్శించారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు మజ్లిస్‌ అంటే భయం 
మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్‌ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. 

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్‌ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 
 
కాంగ్రెస్‌ది నయవంచన: రఘునందన్‌రావు 
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
సహరా ఇండియా బాధితుల నిరసన 
సహరా ఇండియా సంస్థలో డిపాజిట్‌ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్‌ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement