Telangana: అసమ్మతి శ్రుతి పెంచుతున్న కమలనాథ స్వరం | Disagreement situation in Telangana BJP | Sakshi
Sakshi News home page

Telangana: అసమ్మతి శ్రుతి పెంచుతున్న కమలనాథ స్వరం

Published Tue, Jul 4 2023 1:02 AM | Last Updated on Tue, Jul 4 2023 7:33 AM

Disagreement situation in Telangana BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్ర నేతలు చేస్తున్న రచ్చ, పార్టీలో ఇటీవలి పరిణామాలతో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఏర్పడి 43 ఏళ్లు గడుస్తున్నా గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదనే అభిప్రాయం కొందరు సీనియర్లలో వ్యక్తమౌతోంది. నేతల మధ్య అభిప్రాయభేదాల వంటివి ఉన్నా ఇప్పటిలా ముఖ్యనేతలు గ్రూపులుగా, వర్గాలుగా ఏర్పడటం వంటివి చోటు చేసుకోలేదు.

బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగిన సందర్భాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సైతం బహిరంగంగా, ట్విట్టర్‌ లేదా ఏదో ఒక పరోక్ష రూపాల్లో అసంతృప్తి గళం విన్పించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు.  

చల్లార్చలేదు..చక్కదిద్దలేదు..: వాస్తవానికి పలువురు ముఖ్యనేతల్లో అసంతృప్తి, సఖ్యత కొరవడడం, పాత–కొత్త నాయకుల మధ్య సమన్వయం లేమి, గ్రూపులు లేదా వర్గాలను ప్రోత్సహించే విధంగా కొందరు వ్యవహరించడం, రాష్ట్ర రాజకీయాల్లో తామే ఫోకస్‌లో ఉండేలా, మీడియాలో తమకే ప్రచారం లభించేలా కార్యక్రమాల నిర్వహణ వంటివి రాష్ట్ర బీజేపీలో కొన్నినెలలుగా సాగుతున్నాయి.

అయినా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అసంతృప్తిని చల్లార్చేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయానికి తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, శివప్రకాష్, అరవింద్‌ మీనన్‌లను ఇన్‌చార్జిలుగా నియమించినా, వారెప్పుడూ పార్టీలోని అంతర్గత సమస్యలు, నేతల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

పైగా ఒకరిద్దరు ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా వత్తాసు పలకడం, మద్దతు తెలపడం వంటివి చేయడం వల్ల కూడా పార్టీలో పరిస్థితులు దిగజారాయని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత గందరగోళంగా తయారయ్యాయనే ఆందోళన వ్యక్తమౌతోంది.

మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, సరైన విధంగా స్పష్టత ఇవ్వకపోవడం కూడా కేడర్‌తో పాటు ముఖ్యనేతలను సైతం అయోమయానికి గురి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘ఈ నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో..లేదో’ అంటూ ఆదివారం బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

మాటల మంటలు.. 
ఇటీవల ఓ దున్నపోతును వెనకనుంచి తన్ని వ్యానెక్కించే వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి.. రాష్ట్ర పార్టీకి ఇదే ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ వ్యాఖ్యానించడం కలకలం సృష్టించింది. అంతకు కొన్నిరోజుల ముందే.. సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో సంజయ్‌కు అనుకూలంగా ఉండే వారితో తన నివాసంలో జితేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిలకు జాతీయపార్టీ అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు తమకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకపోవడంపై నేతల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్టు వార్తలొచ్చాయి. అంతకు ముందు ఓ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, ఓ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఇద్దరు మాజీ ఎంపీలు, ఓ ఎమ్మెల్యే విడివిడిగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలగజేశాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం, రాష్ట్ర అధ్యక్షుడి వైఫల్యాలు, పార్టీలో చేరికలు లేకపోవడం, ముఖ్య నాయకత్వం ఒంటెద్దు పోకడలు, ఇతర అంశాలపై చేసిన వ్యాఖ్యలు వారిలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయని అంటున్నారు. ఇక ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రత్యేక భేటీల సందర్భంగా, హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన నడ్డాతో పలువురు ముఖ్యనేతలు సమావేశమైనప్పుడు కూడా నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

నడ్డాతో జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు విడివిడిగా సమావేశమై తమ అసంతృప్తికి గల కారణాలను, పార్టీలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను గురించి విడమరిచి చెప్పినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. తాజాగా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఢిల్లీలో అసంతృప్తి స్వరం తీవ్రస్థాయిలో విన్పించడం బీజేపీలో మరోమారు కలకలం రేపింది.

తనకు తగిన ప్రాధ్యానత, గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ ప్రధాని మోదీ మినహా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలపై విమర్శలు గుప్పించడం గమనార్హం. జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అగ్రనేత అమిత్‌షాల తీరుపై సైతం ఆయన వ్యాఖ్యలు చేయడం పార్టీ కేడర్‌ను విస్మయానికి గురి చేసింది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో నెలకొన్న పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పలువురు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement