సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్‌లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు.
పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్‌ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్ ఇచ్చారు.
కిషన్‌రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే ..
రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు.
అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్‌ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్‌ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్‌చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్‌లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్ ఫొటోనో వేయలేదు. తరుణ్‌ఛుగ్‌నో, బన్సల్‌ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్ ప్రశ్నించారు.
జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..?
పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్ లీడర్ పదవి అడిగిన కార్పొరేటర్ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు.
పదేళ్లుగా కష్టపడుతున్నా..
పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు..
దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్‌షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment