సాక్షి, పలాస(శ్రీకాకుళం): మోస పూరిత రాజకీయాలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు యుటర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం పలాసలో బీజేపీ ప్రజాచైతన్య బస్సు యాత్రను ప్రారంభించిన అమిత్‌షా.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని తెలిసే కాళ్లావేళ్లాపడి మరీ పొత్తు కొసం చంద్రబాబు వెంపర్లాడారని తెలిపారు. తెలుగు ప్రజల కోసం దివంగత నేత ఎన్టీఆర్ పార్టీ పెడితే కాంగ్రెస్‌తో జతకట్టి టీడీపీని బాబు వంచన చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆరోపించారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్లు సమయం ఉన్నప్పటికీ ఐదేళ్లలోనే అన్నీ ఇచ్చామన్నారు. విభజన చట్టంలో లేని విద్యాసంస్థలు కూడా ఏపీకి ఇచ్చామన్నారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి తప్పుకున్నాక మోదీ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత.. మళ్లీ చంద్రబాబు ఎన్డీయేవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment