సాక్షి, వైఎస్సార్ కడప: అనేక సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయంలో ప్రముఖ సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెప్పించుకున్నారని గుర్తు చేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీల నివేదిక స్పష్టం చేశాయని అన్నారు. కానీ, గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీల నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదని అంజాద్ బాషా మండిపడ్డారు. ముందుగా టీడీపీ నేతలు వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గల్లీ నాయకుడి కన్నా హీనంగా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీరు దుర్మార్గమని అన్నారు. కమిటీల నివేదికను గౌరవిస్తూ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అమరావతిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు సంతోషంగా మద్దతిస్తున్నారని తెలిపారు. పెద్దల సభ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కానీ, మండలిలో బలం ఉందని.. ప్రభుత్వ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు మండలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు అవసరం అయ్యే బిల్లులను అడ్డుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు తయారయ్యారని అంజాద్ బాషా మండిపడ్డారు.
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ బిల్లులపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అంజాద్ బాషా అన్నారు. ఎన్‌పీఆర్ అనేది పదేళ్లకు ఒకసారి చేస్తారని చెప్పారు. గతంలో 2010లో చేశారని, మళ్లీ ఇప్పుడు చేస్తున్నారని గుర్తు చేశారు. 2019 ఆగస్టు 16న ఎన్‌పీఆర్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్ఆర్‌సీపై ప్రధానంగా ముస్లిం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వెంటనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లులకు పూర్తి వ్యతిరేకమని ఆయన బహిరంగంగా ప్రకటించారని అంజాద్ బాషా తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ వాసిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతి ప్రాంతాల రైతులే కావాలి, మిగతా జిల్లాల రైతులు అవసరం లేదనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీరు నిల్వ చేయలేకపోతున్నామంటే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అన్నారు. గతంలో హైకోర్టు బెంచ్ కావాలని రాయలసీమ లాయర్లు చంద్రబాబు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ నేతలు అడ్డుకోవడం సిగ్గు చేటని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాంత ప్రజలు టీడీపీ నేతలను కచ్చితంగా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అని చంద్రబాబు అంటే.. ఎందుకు టీడీపీ నేతలు నోరు మెదపటంలేదని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
70 ఏళ్ల క్రితం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వందల ఏళ్లుగా రాయలసీమ ప్రాంత రైతులు, ప్రజలు అనేక విషయాల్లో త్యాగం చేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రజలు మెచ్చిన ప్యాకేజి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంత ప్రజలను రౌడీలు, గుండాలు అంటే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కుటుంబ కార్యక్రమం లాగా చేశావని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ప్రశంసించారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్లు తాగే, పొగరు వ్యక్తి జేసీ దివాకర్‌రెడ్డి రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమలో ఇలాంటి వారు పుట్టడం దురదృష్టకరమన్నారు. గత ఐదు ఏళ్ల టీడీపీ హయాంలో రాయలసీమకు ఏం చేసారో చంద్రబాబు స్పష్టం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment