
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దివంగత వైఎస్సార్ హయాంలో, తదనంతర ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతోపాటు నేతల అవినీతి తారాస్థాయికి చేరడం తదితర కారణాలతో ఆయన రెండు నెలలుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.
ఈక్రమంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. వచ్చే నెల 2న జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారు. విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం నెల్లూరులో బహిరంగ సభ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శుక్రవారం వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆనం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించడానికి వెళ్లి చేరిక తేదీ ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను కూడా ఆనం కలవనున్నారు.