
మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు ,వెంకటగిరి: ‘టీడీపీ ప్రభుత్వం మహిళలు, రైతులను మోసం చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అండగా ఉంటుంది. అభివృద్ధికి కృషి చేస్తుంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ డిక్లరేషన్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తారన్నారు. ‘వర్షం కావాలంటే బాబు పోవాలి’ అనే కొత్త నినాదాన్ని వెంకటగిరి వేదికగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత ఆకాంక్షలను తెలుసుకునేందుకు మార్చి మొదటివారంలో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు తెలియజేసి యువత డిక్లరేషన్ ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చింతమనేని వ్యాఖ్యలు దారుణం
దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను స్ఫూర్తిగా తీసుకుని చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించారన్నారు. టీడీపీ నేతలు దళితులు, బీసీలు, గిరిజనుల ఓట్లు తమకు అవసరం లేదని ప్రకటించి ఎన్నికలకు రాగలరా అని ప్రశ్నించారు. వెంకటగిరి ప్రాంతాన్ని విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.
అన్యాక్రాంతం కాలేదు
వెంకటగిరి రాజాల దాతృత్వంతో ఏర్పాటు చేసిన వీఆర్ విద్యాసంస్థలకు అప్పట్లో వారిచ్చిన స్థలంలో ఒక్క సెంట్ కూడా అన్యాక్రాంతం కాకుండా చూశామన్నారు. అలాగే మరో ఐదెకరాలు కొనుగోలు చేసి వారి పేరుతోనే మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన చరిత్ర తమదని ఆనం తెలిపారు. అయితే వెంకటగిరి రాజాల దానంతో ఏర్పాటైన గోషాస్పత్రిని మూయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల ప్రయత్నించారని విమర్శించారు. రాజా కుటుంబీకులకు సరైన గౌరవం కూడా ఇవ్వని అధికారపార్టీ నేతలకు తమను విమర్శించే నైతికత లేదని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ జి.ఢిల్లీబాబు, వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, ధనియాల రాధ, యస్ధానీబాషా, గూడూరు భాస్కర్‌రెడ్డి, ఆవుల గిరియాదవ్ పాల్గొన్నారు.