ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియ పటేల్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : 2025 కల్లా దేశ ప్రజల వైద్యానికి జాతీయాదాయంలో 2.5 శాతం ఖర్చు చేయడమే లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య విధానం(ఎన్‌హెచ్‌పీ)-2017 అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచుతామని తెలిపింది. వాటాదారులతో చర్చలు జరిపి, కిందిస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని ఎన్‌హెచ్‌పీ విధానాన్ని రూపొందిచినట్టు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్యం కొరకు బడ్జెట్‌లో కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఎన్‌హెచ్‌పీ అమలుకు సంబంధించిన ప్రణాళికలను ముందే రూపొందిచినట్టు వెల్లడించింది. అన్ని స్థాయిల్లోని సంబంధిత అధికారులు ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరింది.
దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, వైద్య సేవలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అనుప్రియ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
- జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి అందుకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం, జనని శిశు సురక్ష, రాష్ట్రీయ బాల స్వస్థ్య, రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమాలను ద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం.
- జాతీయ క్షయ నియంత్రణ, జాతీయ వ్యాధుల నివారణ, జాతీయ కుష్టు అవగాహన, జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల ద్వారా క్షయ, కుష్టు, ఎయిడ్స్, టీబీ రోగులకు మందులు అందజేత.
- ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను( పీహెచ్‌సీ) పూర్తి స్థాయి ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం.
- ప్రమాదకరమైన రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను, హైపర్ టెన్షన్, డయాబెటిస్ తదితర వ్యాధులను గుర్తించి వాటికి సరైన ప్రణాళిక ద్వారా చికిత్స అందించడం.
- జిల్లా ఆస్పత్రులలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం అందించడం.
- దేశంలోని ఆస్పత్రులను బలోపేతం చేయడం. ప్రతి రాష్ట్రంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లను నిర్మించడం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆధునీకరించడం ద్వారా ఖరీదైన వైద్య సేవలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేయవచ్చు.
- జన్ ఔషధి పథకం ద్వారా పెద్ద సంఖ్యలో జనరిక్ మందులను ఉత్పత్తి చేసి వాటిని తక్కువ ధరలకే ప్రతి ఒక్కరికి అందజేయడం.
- రాష్ట్రీయ స్సస్థ్య బీమా యోజన ద్వారా కుటుంబలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించి, వారికి నగదు రహిత వైద్య చికిత్సలకు స్మార్ట్ కార్డ్‌లు అందజేయడం.
Comments
Please login to add a commentAdd a comment