National Health Policy
-
‘ఆయుష్మాన్’ లబ్ధిదారులను గుర్తించండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్–ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య అభియాన్(ఏబీ–పీఎం–జేఏవై) కింద లబ్ధిదారులను గుర్తించాలని ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించే జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతలను అప్పగించాలని కోరుతూ ఉత్తర్వులిచ్చింది. సామాజిక, ఆర్థిక, కుల గణన–2011లో లేని వారి పేర్లను ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల జాబితాలో చేర్చుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించే ఈ పథకం సెప్టెంబర్ 23న మొదలైంది. -
ఆయుష్మాన్ భారత్‌తో 10 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్–నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ (ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం) పథకం ద్వారా కొత్తగా 10,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు, లబ్ధిదారులకు వివరాలు తెలిపేందుకు సుమారు లక్ష మంది వరకు ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నామని చెప్పారు. రోగులకు సహకరిస్తూ ఆస్పత్రికి, లబ్ధిదారుల మధ్య సమన్వయకర్తలుగా ఆయుష్మాన్ మిత్రలు వ్యవహరిస్తారని.. పథకం కింద ఎంపికైన ప్రతి ఆస్పత్రిలో వీరు అందుబాటులో ఉంటారని, హెల్ప్ డెస్క్ నిర్వహిస్తారని వివరించారు. పథకం కింద ఇప్పటికే 20,000 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులు ఎంపికయ్యాయని.. లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే (ఎస్ఈసీసీ) ఆధారంగా ఎంపిక చేయనున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ క్యూఆర్ కోడ్స్‌తో కూడిన లేఖను అందజేయనున్నారు. ఆయుష్మాన్ మిత్రల కోసం నైపుణ్య అభివృద్ధి శాఖతో ఆరోగ్య శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్మాన్ భారత్‌తో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్న విషయం తెలిసిందే. -
‘వైద్యానికి 2.5 శాతం ఖర్చు చేస్తాం’
న్యూఢిల్లీ : 2025 కల్లా దేశ ప్రజల వైద్యానికి జాతీయాదాయంలో 2.5 శాతం ఖర్చు చేయడమే లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య విధానం(ఎన్హెచ్పీ)-2017 అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచుతామని తెలిపింది. వాటాదారులతో చర్చలు జరిపి, కిందిస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని ఎన్హెచ్పీ విధానాన్ని రూపొందిచినట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్యం కొరకు బడ్జెట్లో కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఎన్హెచ్పీ అమలుకు సంబంధించిన ప్రణాళికలను ముందే రూపొందిచినట్టు వెల్లడించింది. అన్ని స్థాయిల్లోని సంబంధిత అధికారులు ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరింది. దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, వైద్య సేవలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అనుప్రియ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి అందుకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం, జనని శిశు సురక్ష, రాష్ట్రీయ బాల స్వస్థ్య, రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమాలను ద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం. జాతీయ క్షయ నియంత్రణ, జాతీయ వ్యాధుల నివారణ, జాతీయ కుష్టు అవగాహన, జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల ద్వారా క్షయ, కుష్టు, ఎయిడ్స్, టీబీ రోగులకు మందులు అందజేత. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను( పీహెచ్సీ) పూర్తి స్థాయి ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం. ప్రమాదకరమైన రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను, హైపర్ టెన్షన్, డయాబెటిస్ తదితర వ్యాధులను గుర్తించి వాటికి సరైన ప్రణాళిక ద్వారా చికిత్స అందించడం. జిల్లా ఆస్పత్రులలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం అందించడం. దేశంలోని ఆస్పత్రులను బలోపేతం చేయడం. ప్రతి రాష్ట్రంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లను నిర్మించడం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆధునీకరించడం ద్వారా ఖరీదైన వైద్య సేవలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేయవచ్చు. జన్ ఔషధి పథకం ద్వారా పెద్ద సంఖ్యలో జనరిక్ మందులను ఉత్పత్తి చేసి వాటిని తక్కువ ధరలకే ప్రతి ఒక్కరికి అందజేయడం. రాష్ట్రీయ స్సస్థ్య బీమా యోజన ద్వారా కుటుంబలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించి, వారికి నగదు రహిత వైద్య చికిత్సలకు స్మార్ట్ కార్డ్‌లు అందజేయడం. -
ఈ విధానంతో ఆరోగ్యమెలా?
కొండంత రాగం తీసి సణుగుడుతో చతికిలబడినట్టు రెండేళ్లనుంచి అందరినీ ఊరిస్తున్న జాతీయ ఆరోగ్య విధానం చివరకు నిరాశనే మిగిల్చింది. మన ఆరోగ్య వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడంలో భాగంగా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయబోతున్నట్టు 2015లో విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా ప్రకటించింది. జనం సంతోషించారు. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేస్తే వైద్య సౌకర్యాలను నిరాకరించినపక్షంలో న్యాయపరమైన చర్య తీసుకోవడానికి పౌరులకు వీలవుతుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య హక్కుల చట్టం కూడా తీసుకొస్తామని ముసాయిదా తెలిపింది. కానీ తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధానం–2017లో అది కాస్తా గల్లంతైంది. అందుకు బదులు ఆరోగ్య సేవలు పొందడానికి పౌరులందరికీ ‘అర్హత’ ఉంటుందని ఆ విధానం చెబుతోంది. జీవించే హక్కుకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణలో ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉన్నట్టే. కానీ ఆరోగ్య సేవలు పొందడమన్నది ఆదేశిక సూత్రాల ఖాతాలోకి వెళ్లింది. దీని పర్యవసానాలెలా ఉన్నాయో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య సేవల తీరుతెన్నులే చెబుతాయి.స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తంగా ఆరోగ్య సేవలకు 4 శాతం ఖర్చవుతున్నదని అంచనా. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వాటా దాదాపు ఒకటిన్నర శాతం మాత్రమే. ప్రజానీకం తినీ తినకా మిగు ల్చుకున్న సొమ్ము నుంచి... అప్పో సప్పో చేసి తెచ్చుకున్న సొమ్మునుంచి మిగిలిన 3 శాతం ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చవుతున్న సొమ్ములో ఆర్భాటంగా ప్రచారం జరిగే ఆరోగ్య బీమా వాటా నిండా పది శాతం కూడా లేదు. వీటన్నిటి ఫలితం ఎలా ఉంటున్నదో అందరికీ తెలుసు. ప్రజారోగ్యం అనే భావనే పూర్తిగా అటకెక్కింది. వ్యాధుల బారిన పడిన నిరుపేదలకు మరణమే శరణమవుతోంది. అలాగని దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఏం లేదు. మన జీడీపీ 7 శాతమని ఈమధ్యే ప్రకటించారు. అది అందరి అంచనాలనూ మించిపోయింది. ఈ గణాంకా లన్నిటినీ అపహాస్యం చేసేలా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రాణాలను కబళిస్తు న్నాయి. దేశ జనాభాలో అయిదో వంతుమంది... అంటే 24 కోట్లమంది ప్రజలు మధుమేహం రక్తపోటు, కేన్సర్, హృద్రోగంవంటి వ్యాధులతో బాధపడుతు న్నారు. ఇవి రాను రాను విస్తరిస్తున్నాయి. మధుమేహంలో ప్రపంచ దేశాలతో పోటీ పడు తున్నాం. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వగైరాలవల్ల వచ్చే వ్యాధులు, అంటు రోగాల సంగతి చెప్పనవసరం లేదు. నివారించదగిన డెంగ్యూ, మలేరియా, డయే రియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఏటా లక్షలాదిమంది మరణిస్తున్నారు. గర్భస్థ శిశు మరణాలు, నవజాత శిశు మరణాలు, ప్రసూతి మరణాలు నివారించడంలో ఎంతో కొంత మెరుగుదల కనబరుస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లున్నాయి. నగరాలకూ, పట్టణాలకూ మధ్య... పట్టణాలకూ, పల్లెలకూ మధ్య... మైదాన ప్రాంతాలకూ, ఆది వాసీ ప్రాంతాలకూ మధ్య ఆరోగ్య సేవల లభ్యతలో ఎంతో అగాధం ఉంది. ఉత్త రాది రాష్ట్రాలకూ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య... ఈశాన్య రాష్ట్రాలకూ, ఇతర రాష్ట్రా లకూ మధ్య సైతం ఇదే స్థితి. సారాంశంలో మెరుగైన వైద్య చికిత్సకు ప్రజలు ఎంతో దూరంలో ఉంటున్నారు. వైద్యుల కొరత అంతా ఇంతా కాదు. ఆ పోస్టుల భర్తీలో దాదాపు అన్ని ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. కొన్నిచోట్ల 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే మరికొన్నిచోట్ల 60శాతం వరకూ కూడా ఖాళీలుంటున్నాయని చెబు తున్నారు. ఇక ఇతర సిబ్బంది మాట చెప్పనవసరమే లేదు. అరకొర జీతాలతో, కాంట్రాక్టు ఉద్యోగాలతో వారు తమ డ్యూటీపై ఏమాత్రం శ్రద్ధ పెట్టగలరో ఎవరైనా ఆలోచించుకోవాల్సిందే. అందువల్లే ఆసుపత్రులకొచ్చిన నిరుపేద రోగులను లంచం డబ్బుల కోసం పీక్కు తినే స్థితి నెలకొంది. ప్రతి దేశమూ జీడీపీలో కనీసం 2.5 శాతం ప్రజారోగ్యానికి వెచ్చించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దాలక్రితం చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాన్ని ఆచరించిన పాపాన పోలేదు. జీడీపీలో 2 శాతం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు 2002నాటి జాతీయ ఆరోగ్య విధానం ఘనంగా ప్రకటించుకుంది. కానీ దశాబ్దన్నర కాలం సుదీర్ఘ జాప్యం తర్వాత ఇప్పుడు వెలువరించిన జాతీయ ఆరోగ్య విధానం సైతం 2025 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యరంగానికి వెచ్చిస్తామని చెబుతోంది. సమస్య ప్రాణం మీదికొచ్చినా వాయిదా పద్ధతే తమ విధానమని పాలకులు ప్రకటిస్తు న్నారు. ఎంత సిగ్గుచేటు! మనకంటే ఎంతో వెనకబడి ఉన్న అఫ్ఘానిస్తాన్ తన జీడీపీలో 7.6 శాతం, భూటాన్ 5.2 శాతం రువాండా 10.5 శాతం ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తుంటే మన ఆలోచన మాత్రం మారడంలేదు. దేశంలో పేదరికం విస్తరించడానికి గల ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి పెట్టే అపరిమితమైన ఖర్చు ఒకటని జాతీయ ఆరోగ్య విధానం సరిగానే గుర్తించింది. కానీ దాన్ని చక్కదిద్దే పనికి మాత్రం పూనుకోలేదు. ఏటా వైద్యంపై వెచ్చించే సొమ్ము వల్ల పేదరికంలో దిగబడిపోతున్నవారి సంఖ్య దాదాపు ఆరున్నర కోట్లని 2015లో విడుదల చేసిన ఆరోగ్య విధాన ముసాయిదా తెలిపింది. అలాంటివారి కోసం బీమా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వేతర రంగం తోడ్పాటు తీసుకుంటామని కేంద్ర కేబినెట్ ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధా నం–2017 ప్రకటిస్తోంది. నిజానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరిస్తే చాలా వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి అరికట్టడానికి వీలుంటుంది. బీమాపై ఆధారపడే స్థితి తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వ చర్యలుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఫైలేరియాసిస్, కాలా–అజర్వంటి వ్యాధుల నిర్మూ లనకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించారు. వాటిని సాధించాలన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పటిష్టత తప్పనిసరి. ఒకరి అనారోగ్యం మరొకరి మహా భాగ్యంగా మార కుండా చూడటమే ఏ ఆరోగ్య విధానానికి గీటురాయి కావాలి. అప్పుడే ఆరోగ్యం అందరిదవుతుంది. ఆ విషయంలో జాతీయ ఆరోగ్య విధానం విఫలమైంది. -
అవమానాలు మంచివే: మోదీ
న్యూఢిల్లీ: ‘అవమానాలు తప్పకుండా సాయం చేస్తాయి. అయితే అవి విజయంలోనైనా కావచ్చు, ఓటమిలోనైనా కావచ్చు’ అని ప్రధాని మోదీ శుక్రవారం ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఇటీవలి అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఆరోగ్య విధానం(ఎన్హెచ్పీ) దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని ప్రధాని తెలిపారు. ట్వీటర్లో మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంతో పేదలు, మధ్య తరగతివారు అధికంగా లబ్ధి పొందుతారని ఆయన స్పష్టం చేశారు. -
వైద్యం ఇంకా పూజ్యమే
వైద్యసేవల కొరతతో దేశంలో ఏటా 10 లక్షలమంది మృతి ♦ 125 కోట్ల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్య 9.29 లక్షలే.. ♦ స్పెషలిస్ట్ డాక్టర్‌ను చూడని 70 కోట్ల మంది! ♦ రోగాలతో అప్పులపాలవుతున్నవారు ఆరుకోట్లు పైనే ♦ 31 శాతం జనాభా ఉన్న 6 రాష్ట్రాల్లోనే 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు ♦ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో సరైన వైద్యసేవలు అందుబాటులో లేక ఏటా 10 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు... గుండెలు పగిలే ఈ కఠోర వాస్తవం వేరెవరో చెప్పింది కాదు.. స్వయానా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక వెల్లడించిన పచ్చినిజం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ది మూడోస్థానమని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో దేశంలోని సామాన్యులకు కనీస వైద్యసేవలు కూడా అందుబాటులో లేవన్న కఠోర సత్యాన్ని ఇది చాటుతోంది. దేశంలో అందుతున్న వైద్యసేవల్లోని డొల్లతనాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసింది. తాజాగా కేంద్రానికి సమర్పించిన ఈ నివేదికలో పలు దిగ్భ్రాంతి కలిగించే అంశాలున్నాయి. దాదాపు 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 9.29 లక్షలమంది మాత్రమే డాక్టర్లున్నారని, అందులోనూ నిత్యం వైద్యసేవలందిస్తున్నవారు 7.24 లక్షలమందేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమందికీ ఒక డాక్టరు ఉండాలి. కానీ భారత్‌లో ఉన్న వైద్యులసంఖ్యతో పోలిస్తే 2వేల మందికి కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితిని ఈ నివేదిక కళ్లకు కట్టింది. నివేదికలో ప్రస్తావించిన ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశ జనాభా 125 కోట్లు ఉంటే.. అందులో 70 కోట్ల మందికి ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందుబాటులోకి రాలేదు. డబ్బున్నవాళ్లు నిత్యం స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలోనే వైద్యం పొందుతుంటే.. అసలు స్పెషలిస్ట్ డాక్టర్ అంటేనే తెలియనివాళ్లే అధికంగా ఉన్నారు. ► దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్ లోపభూయిష్టంగా ఉంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారున్నారు, వీరిలో వైద్యం చేస్తున్నవాళ్లెందరు?, మృతిచెందిన వారెంతమంది తదితర లెక్కలు సరిగా లేవు. అంతేకాదు ప్రస్తుతం స్పెషలిస్ట్ వైద్యులు, సూపర్ స్పెషలిస్టు వైద్యుల్లో 80 శాతం మంది పట్టణాల్లోనే ఉన్నారు. దీనివల్ల గ్రామీణులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అందట్లేదు. ► దేశంలో వైద్య పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య విధానం-2015 ప్రకారం ఏటా వైద్యసేవలకోసం వెళుతున్నవారిలో 6.3 కోట్లమంది అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా నాన్ కమ్యునికబుల్ డిసీజెస్(ఎన్సీడీ), మధుమేహం, గుండెజబ్బు, కేన్సర్ వంటి జబ్బులు తీవ్రమవుతున్నందున సామాన్య, మధ్యతరగతి వర్గాలు అప్పుల్లోకి వెళుతున్నాయి. వేధిస్త్తున్న వైద్యకళాశాలల కొరత దేశంలో ఉన్న జనాభాకు, వైద్యకళాశాలల సంఖ్యకూ పొంతనలేదు. అంతేకాదు.. దేశంలోఉన్న 65 శాతం వైద్య కళాశాలలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రాలమధ్య వైద్యసేవల వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు మధ్యభారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. విచిత్రమేమంటే దేశజనాభాలో 31 శాతం జనాభా ఆరు రాష్ట్రాల్లో ఉంటే.. 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడే ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల్లో 46 శాతం జనాభా ఉంటే.. వాటిల్లో కేవలం 21 % ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటులో అసమానతలు తొలగిం చాల్సిన, అన్ని రాష్ట్రాలకు సేవలందేలా సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత భారతీయ వైద్యమండలిదే.