ఈ విధానంతో ఆరోగ్యమెలా?
కొండంత రాగం తీసి సణుగుడుతో చతికిలబడినట్టు రెండేళ్లనుంచి అందరినీ ఊరిస్తున్న జాతీయ ఆరోగ్య విధానం చివరకు నిరాశనే మిగిల్చింది. మన ఆరోగ్య వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడంలో భాగంగా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయబోతున్నట్టు 2015లో విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా ప్రకటించింది. జనం సంతోషించారు. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేస్తే వైద్య సౌకర్యాలను నిరాకరించినపక్షంలో న్యాయపరమైన చర్య తీసుకోవడానికి పౌరులకు వీలవుతుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య హక్కుల చట్టం కూడా తీసుకొస్తామని ముసాయిదా తెలిపింది. కానీ తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధానం–2017లో అది కాస్తా గల్లంతైంది. అందుకు బదులు ఆరోగ్య సేవలు పొందడానికి పౌరులందరికీ ‘అర్హత’ ఉంటుందని ఆ విధానం చెబుతోంది. జీవించే హక్కుకు పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణలో ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉన్నట్టే.
కానీ ఆరోగ్య సేవలు పొందడమన్నది ఆదేశిక సూత్రాల ఖాతాలోకి వెళ్లింది. దీని పర్యవసానాలెలా ఉన్నాయో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య సేవల తీరుతెన్నులే చెబుతాయి.స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తంగా ఆరోగ్య సేవలకు 4 శాతం ఖర్చవుతున్నదని అంచనా. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వాటా దాదాపు ఒకటిన్నర శాతం మాత్రమే. ప్రజానీకం తినీ తినకా మిగు ల్చుకున్న సొమ్ము నుంచి... అప్పో సప్పో చేసి తెచ్చుకున్న సొమ్మునుంచి మిగిలిన 3 శాతం ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చవుతున్న సొమ్ములో ఆర్భాటంగా ప్రచారం జరిగే ఆరోగ్య బీమా వాటా నిండా పది శాతం కూడా లేదు. వీటన్నిటి ఫలితం ఎలా ఉంటున్నదో అందరికీ తెలుసు. ప్రజారోగ్యం అనే భావనే పూర్తిగా అటకెక్కింది. వ్యాధుల బారిన పడిన నిరుపేదలకు మరణమే శరణమవుతోంది.
అలాగని దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఏం లేదు. మన జీడీపీ 7 శాతమని ఈమధ్యే ప్రకటించారు. అది అందరి అంచనాలనూ మించిపోయింది. ఈ గణాంకా లన్నిటినీ అపహాస్యం చేసేలా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రాణాలను కబళిస్తు న్నాయి. దేశ జనాభాలో అయిదో వంతుమంది... అంటే 24 కోట్లమంది ప్రజలు మధుమేహం రక్తపోటు, కేన్సర్, హృద్రోగంవంటి వ్యాధులతో బాధపడుతు న్నారు. ఇవి రాను రాను విస్తరిస్తున్నాయి. మధుమేహంలో ప్రపంచ దేశాలతో పోటీ పడు తున్నాం. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వగైరాలవల్ల వచ్చే వ్యాధులు, అంటు రోగాల సంగతి చెప్పనవసరం లేదు. నివారించదగిన డెంగ్యూ, మలేరియా, డయే రియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఏటా లక్షలాదిమంది మరణిస్తున్నారు. గర్భస్థ శిశు మరణాలు, నవజాత శిశు మరణాలు, ప్రసూతి మరణాలు నివారించడంలో ఎంతో కొంత మెరుగుదల కనబరుస్తున్నా ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి.
మన దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లున్నాయి. నగరాలకూ, పట్టణాలకూ మధ్య... పట్టణాలకూ, పల్లెలకూ మధ్య... మైదాన ప్రాంతాలకూ, ఆది వాసీ ప్రాంతాలకూ మధ్య ఆరోగ్య సేవల లభ్యతలో ఎంతో అగాధం ఉంది. ఉత్త రాది రాష్ట్రాలకూ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య... ఈశాన్య రాష్ట్రాలకూ, ఇతర రాష్ట్రా లకూ మధ్య సైతం ఇదే స్థితి. సారాంశంలో మెరుగైన వైద్య చికిత్సకు ప్రజలు ఎంతో దూరంలో ఉంటున్నారు. వైద్యుల కొరత అంతా ఇంతా కాదు. ఆ పోస్టుల భర్తీలో దాదాపు అన్ని ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. కొన్నిచోట్ల 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే మరికొన్నిచోట్ల 60శాతం వరకూ కూడా ఖాళీలుంటున్నాయని చెబు తున్నారు. ఇక ఇతర సిబ్బంది మాట చెప్పనవసరమే లేదు. అరకొర జీతాలతో, కాంట్రాక్టు ఉద్యోగాలతో వారు తమ డ్యూటీపై ఏమాత్రం శ్రద్ధ పెట్టగలరో ఎవరైనా ఆలోచించుకోవాల్సిందే. అందువల్లే ఆసుపత్రులకొచ్చిన నిరుపేద రోగులను లంచం డబ్బుల కోసం పీక్కు తినే స్థితి నెలకొంది. ప్రతి దేశమూ జీడీపీలో కనీసం 2.5 శాతం ప్రజారోగ్యానికి వెచ్చించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దశాబ్దాలక్రితం చెప్పింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాన్ని ఆచరించిన పాపాన పోలేదు. జీడీపీలో 2 శాతం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు 2002నాటి జాతీయ ఆరోగ్య విధానం ఘనంగా ప్రకటించుకుంది. కానీ దశాబ్దన్నర కాలం సుదీర్ఘ జాప్యం తర్వాత ఇప్పుడు వెలువరించిన జాతీయ ఆరోగ్య విధానం సైతం 2025 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యరంగానికి వెచ్చిస్తామని చెబుతోంది. సమస్య ప్రాణం మీదికొచ్చినా వాయిదా పద్ధతే తమ విధానమని పాలకులు ప్రకటిస్తు న్నారు. ఎంత సిగ్గుచేటు! మనకంటే ఎంతో వెనకబడి ఉన్న అఫ్ఘానిస్తాన్ తన జీడీపీలో 7.6 శాతం, భూటాన్ 5.2 శాతం రువాండా 10.5 శాతం ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తుంటే మన ఆలోచన మాత్రం మారడంలేదు.
దేశంలో పేదరికం విస్తరించడానికి గల ప్రధాన కారణాల్లో ఆరోగ్యానికి పెట్టే అపరిమితమైన ఖర్చు ఒకటని జాతీయ ఆరోగ్య విధానం సరిగానే గుర్తించింది. కానీ దాన్ని చక్కదిద్దే పనికి మాత్రం పూనుకోలేదు. ఏటా వైద్యంపై వెచ్చించే సొమ్ము వల్ల పేదరికంలో దిగబడిపోతున్నవారి సంఖ్య దాదాపు ఆరున్నర కోట్లని 2015లో విడుదల చేసిన ఆరోగ్య విధాన ముసాయిదా తెలిపింది. అలాంటివారి కోసం బీమా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వేతర రంగం తోడ్పాటు తీసుకుంటామని కేంద్ర కేబినెట్ ఆమోదించిన జాతీయ ఆరోగ్య విధా నం–2017 ప్రకటిస్తోంది. నిజానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టపరిస్తే చాలా వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి అరికట్టడానికి వీలుంటుంది. బీమాపై ఆధారపడే స్థితి తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వ చర్యలుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఫైలేరియాసిస్, కాలా–అజర్‌వంటి వ్యాధుల నిర్మూ లనకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించారు. వాటిని సాధించాలన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పటిష్టత తప్పనిసరి. ఒకరి అనారోగ్యం మరొకరి మహా భాగ్యంగా మార కుండా చూడటమే ఏ ఆరోగ్య విధానానికి గీటురాయి కావాలి. అప్పుడే ఆరోగ్యం అందరిదవుతుంది. ఆ విషయంలో జాతీయ ఆరోగ్య విధానం విఫలమైంది.