గాలిలో దీపాలైన ప్రాథమిక హక్కులు! | New Delhi: People Fundamental Rights In Problem | Sakshi
Sakshi News home page

గాలిలో దీపాలైన ప్రాథమిక హక్కులు!

Published Tue, Aug 1 2023 1:16 AM | Last Updated on Tue, Aug 1 2023 6:12 AM

New Delhi: People Fundamental Rights In Problem - Sakshi

అన్య మార్గాలలో సాధించిన ‘బ్రూట్‌ మెజారిటీ’ ద్వారా కోర్టు చెప్పినా పాటించకపోవడం పాలకులకు ‘కూసు విద్య’గా మారింది. లౌకిక రాజ్యాంగ చట్టంలో ప్రజలకు కల్పించామని చెప్పిన పౌర ప్రాథమిక హక్కులు అమలు జరగని పరిస్థితి తలెత్తింది. చివరికి పౌర ప్రాథమిక హక్కు అయిన ‘జీవించే హక్కు’ను ఉన్నత న్యాయస్థానం రక్షించే వరకూ గతి లేని పరిస్థితిని కల్పించి సంకీర్ణ ప్రభుత్వాలు పాలన చలాయిస్తూ వచ్చాయి. ఫలితంగా ప్రజల ప్రాథమిక పౌరహక్కులు సైతం నేడు ‘గాలిలో దీపాలు’గా మారాయి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సెక్యులర్‌ వ్యవస్థకు బదులుగా పాలనా రథాన్ని కుల, మతాలపై ఆధారపడి కాపాడుకోవడానికి పార్టీలు, వాటి సంకీర్ణ పాలనా కూటములు అధికారాన్ని దుర్వినియోగం చేయడానికీ వెనుకాడట్లేదు.

‘‘ప్రపంచంలో తలెత్తుతూ వచ్చిన గొప్ప గొప్ప విప్లవాలన్నింటికీ గొప్పగొప్ప మహాను  భావులు కారకులనుకుంటాం. కానీ, వాస్తవానికి ప్రపంచ మహా విప్లవా లకు కారకులు, నాయకత్వం వహించిందీ ప్రజలేనని మరచిపోరాదు. ఇదే నిజమైన మన ఉమ్మడి హైందవ సంస్కృతి కూడా!’’ – ఎరవాడ కేంద్ర కారాగారంలో బందీగా ఉన్న గాంధీజీ ప్రకటన 17.1.1931

‘‘ఇండియాలో ప్రజా బాహుళ్యాన్ని స్వతంత్రంగా ఆలోచింపనివ్వరు. ఆ స్వేచ్ఛను వారికి దక్కనివ్వరు. ఇది అత్యంత అవమానకర పరిణామం. అందుకే కిరాతకులు ప్రజల్ని చూసి భయపడరు. దయార్ద్ర హృదయులమనుకునే వారికి తెగింపు తక్కువ, తెలివి గలవాళ్లమనుకొనే వాళ్ళు ఎవరెటు పోతే మనకెందుకు లెమ్మని నిర్లిప్తంగా ఉండిపోతారని విలియం మోరిస్‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.’’
– భారత లౌకిక రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

ప్రజల బతుకులు నేడు ‘ఎండమావుల్లో’ తచ్చట్లాడుతున్నాయి. దీనిక్కారణం – ఏదో ఒక ‘రాజ్యమైతే’ ఉంది గానీ దాని ముక్కు ముఖమూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నలభై ఏళ్లలో అలా అలా ఉన్నప్పటికీ తర్వాతి నుంచీ మెరుగవలేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు, వాటి అతుకుల బొంత సంకీర్ణ మంత్రివర్గాలు పాలనకు వచ్చాయి. ఆ వర్గాలు దేశంలో పౌరహక్కుల్ని, ‘భారత ప్రజలమైన మేము’ అన్న సంకల్ప ప్రకటనను ఆచరణ నుంచే గాదు, లౌకిక వ్యవస్థ నుంచే తప్పించేశాయి. ఏనాడైతే ఓహ్రా రిపోర్టు కేంద్ర పాలనా వ్యవస్థలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను బహిర్గతం చేసిందో ఆనాడే ప్రజల లిఖిత పూర్వక సంకల్పానికి చేటు మూడింది. ఓహ్రా రిపోర్టును సమర్థిస్తూ ఆనాడే సుప్రీంకోర్టు ‘‘ప్రభుత్వాలు, పాలకులూ ఎలా పాలన సాగిస్తున్నారో తెలుసుకునే సంపూర్ణ హక్కు ప్రజలకు ఉందని’’ నిర్మొహమాటంగా తీర్పు చెప్పిందని మరచిపోరాదు. 

అయితే విచిత్రమేమంటే, ఇదే లౌకిక రాజ్యాంగ చట్టం ద్వారా ఆ చట్టంలో దేశ ప్రజలకు కల్పించామని చెప్పిన పౌర ప్రాథమిక హక్కులు (21వ అధికరణ నుంచి 45వ అధికరణ వరకూ) అమలు జరగని పరిస్థితి తలెత్తింది. చివరికి 21వ పౌర ప్రాథమిక హక్కు అయిన ‘జీవించే హక్కు’ ఉన్నత న్యాయస్థానం దయదలచి రక్షించే వరకూ గతి లేని పరిస్థితిని కాంగ్రెస్‌ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు కల్పించి పాలన చలాయిస్తూ వస్తున్నాయి. ఈ పాలకుల తతంగమంతటికీ కీలకమైన పునాది... ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్‌ సీట్లపై పట్టు సాధించడం ద్వారా కేంద్రంలో తిష్ఠ వేయగల ఎత్తుకు పాలకులు ఈ క్షణం దాకా అలవాటు పడి ఉండటం! పైగా ఈ 80 పార్లమెంట్‌ స్థానాలను గుప్పిట్లో పెట్టుకొని ఉత్తర – దక్షిణ – తూర్పు భారత రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీయడానికి వారు వెనుకాడటం లేదు.

ఇందుకు రాష్ట్రపతి స్థాయిని కూడా దిగజార్చడానికి జంకడం లేదు. ఆ మాటకొస్తే తొల్లింటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ తర్వాత గవర్నర్ల ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను కూడా కాంగ్రెస్‌ – బీజేపీ పాలకులు, వారి సంకీర్ణ మంత్రి వర్గాలు దిగజార్చుతూ వచ్చాయి. ఫలితంగా ప్రజల ప్రాథమిక పౌర హక్కులు సైతం నేడు ‘గాలిలో దీపాలు’గా మారాయి. క్రమంగా దేశంలో రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సెక్యులర్‌ (కులాతీత, మతాతీత) వ్యవస్థకు బదులుగా పాలనా రథాన్ని కుల, మతాలపై ఆధారపడి కాపాడు కోవడానికి ఈ రెండు రాజకీయ పార్టీలు, వాటి సంకీర్ణ పాలనా కూటములు లౌకిక రాజ్యాంగ ప్రతిపత్తిని, అధికారాన్ని భ్రష్టు పట్టిస్తూ వచ్చాయి. కనుకనే, ఈ పౌరుల ప్రాథమిక హక్కుల్ని

(జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు సహా) ఉభయ కూటముల పాల కులు అమలు చేయించాల్సిన బాధ్యతల (డ్యూటీస్‌)ను ఆచరణలో పక్కకు నెట్టేశాయి. ఇందులో భాగంగానే, రాజ్యాంగం ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ‘పత్రికా స్వేచ్ఛ రక్షణ’కు (అధికరణం 19(1) (2)కు) తనకు తోచినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చాయి ఈ రెండు రాజకీయ కూటములూ! పౌరహక్కుల రక్షణకై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జీవన్‌ రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి రంగంలోకి దిగి మాడు పగిలిపోయే తీర్పులు ఇచ్చే వరకూ అంబేడ్కర్‌ ఆశించిన లౌకిక రాజ్యాంగ విలువలకు న్యాయం నానాటికీ దూరమవుతూ వచ్చింది. అందుకే నెహ్రూ హయాంలోనే గాడి తప్పుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి, నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తూ డాక్టర్‌ అంబేడ్కర్‌ లౌకిక రాజ్యాంగ వ్యవస్థకు క్రమేణా దూరమ వుతున్న భారత పార్లమెంటరీ వ్యవస్థను ఉత్తరోత్తరా భారత ప్రజలు కూల్చివేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ బయటికి రావలసి వచ్చింది. ఆ తరువాతనే ఆయన ఉత్తరాది పాలకుల ‘80 సీట్ల’ నాట కానికి విరుగుడుగా దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్‌ నగరాన్ని ప్రకటించాల్సిన అవసరాన్ని పదే పదే చాటుతూ వచ్చారని మరచి పోరాదు. 

ఇప్పుడు కోర్టు ధిక్కార నేరాలకు, అన్య మార్గాల ద్వారా సాధించిన ‘బ్రూట్‌ మెజారిటీ’ ద్వారా పాల్పడడం పాలకులకు ‘కూసు విద్య’గా మారింది. చివరికి ఒక ఖైదీ మరణశిక్షను సైతం సుప్రీంకోర్టు ‘రాజ్యాంగ విరుద్ధం’గా (1980) ప్రకటించింది. ఆదివాసీల భూమి హక్కుల్ని సుప్రీం కోర్టు 1983లోనే రక్షిస్తూ తీర్పు చెప్పినా ఇప్పటికీ పాలకులు తీర్పును ఉల్లంఘిస్తూనే ఉన్నారు, మోతుబరులకు రక్షణ కల్పిస్తున్నారు. రానురాను ఇక రాజ్యమంటే వ్యాపార దిగ్గజాలదిగా ప్రజల్ని అర్థం చేసుకోమంటున్నారు పాలకులే బాహాటంగా! చివరికి మహిళా క్రీడాకారుల్ని వేధించి, అవమానించిన వాళ్ళు పాలక పక్షానికి చెందిన వారైతే శిక్షార్హులు కాకుండా తప్పించుకోగల్గుతున్నారు. మణి పుర్‌లో ఉనికికి సంబంధించి రెండు జాతుల మధ్య (మైతేయి – కుకీ) ఏర్పడిన తగాదాను ఆసరా చేసుకుని ఒక జాతిని అణచడానికి పాల కులే నడుం కట్టడం స్వార్థ రాజకీయం. గాంధీజీని చంపినవాళ్ళు గాంధీ చాటున దాగి, తిరిగి రాజకీయాలు చలాయించాలని చూడడం కన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉంటుందా?! ఇలాంటి స్థితిని గుర్తు చేస్తూ మహాకవి జాషువా ఏమన్నాడో ఒక్కసారి మరొక్కసారి చెవులారా విందాం:

‘‘ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి
శివమూర్తిౖయె భూమి కవతరించు
ఒక డూర్ధ్వపుండ్రంబు లురువుగా తగిలించి
శివలింగమును జూచి చీదరించు
ఒకడు రెండునుగాని వికట వేషము దాల్చి
పైవారి మీద సవాలు చేయు
ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి
బూడిద గురవడై పుట్టి వచ్చు
మనుజులార మాది ఘనమైన మతమని
ఒకడు తరిమి తరిమి ఉగ్గిడించు
పెక్కు మతములిట్లు పేచీలు సాగింప
మార్గమేది ఐకమత్యమునకు
చిలిపి రాళ్ళకు నగిషీలు చెక్కిచెక్కి
కాలమెంత యుగాంతాన గలిపిరొక్కొ
చదువ నేర్చిన వెర్రిని చంపగలరె
ఒక్క బుద్ధుడు, ఒక్క క్రీస్తు, ఒక్క గాంధి?’’!
abkprasad2006@yahoo.co.in


ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకీయులు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement