సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీరును పలు పార్టీల కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న విధంగా నిధుల కేటాయింపు జరిగిందా లేదా చెప్పాలని టీడీపీ నేతలను పార్థసారధి డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో బాబు కేవలం ఆయన స్వార్ధం కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు.
బాబుకు మంచి వైద్యం చేయించాలి: సీపీఐ నేత రామకృష్ణ
‘రాష్ట్రానికి ఏం సాధించాలి, ఏవి కావాలన్న విషయం మీద ఒక్క చంద్రబాబుకి తప్ప, ఏపీ నేతలతో పాటు ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజితో సమానమని చెప్పారు. ఇప్పుడు అది నిజం కాదనే ధోరణిలో వ్యవహరిస్తూ పక్కా గందరగోళంలో ఉన్నారు. చంద్రబాబు సందిగ్ధత నుంచి ముందు బయటకు రావా. లేదా ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలంటూ’ అన్ని పార్టీల నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది: సీపీఎం నేత మధు
‘రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సంప్రదింపులకే బీజేపీ నేతలకు నాలుగేళ్లు పట్టిందా. 11 జాతీయ విద్యా సంస్థలకు, మరో 9 సంస్థలుకు అనుమతులు ఇచ్చారు. రూ. 9000 కోట్ల నిధులకు కేవలం రూ. 420 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది. ఇక ముసుగులో గుద్దులాటలు ఉండవు. మార్చి 5, 6 కల్లా అంతా తేలిపోతుంది. ఇన్నేళ్లలో అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమంటే చేయనేలేదు. సీఎం దుర్మార్గంగా, ఏ బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రానిది ఒక నాటకం.. రాష్టానిది ఒక నాటకం. మార్చి 6వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన: కొణతాల
రాష్ర్ట విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక విశాఖపట్నం బీచ్ లో మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శన నిర్వహించనుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment