సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, వస్తు సేవల పన్ను సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సోమవారం మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసినందున.. దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావించినా, ఆ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున సాధ్యపడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేసీఆర్ సర్కారేనని, వారి అభిమానంతోనే మరోసారి విజయం సాధించామన్నారు. బీసీలకు ఏదో చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయమని, మైనార్టీలు, బీసీలకు ఈ రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని వాపోయారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం మేరకు రిజర్వేషన్లు కల్పించినా.. మానవీయకోణంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిం చేందుకు ఉద్దేశించిన బీసీ(ఈ) వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ అంశాన్ని బిల్లులో ఎలా పొందుపరుస్తారని రామచంద్రరావు (బీజేపీ) ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్లలో వీటిని పరిగణనలోకి తీసుకోవడంపై సమీక్షించాలన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ స్పష్టం చేశారు.
జీఎస్టీ తగ్గింపుతో ఊరట
రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే వస్తు, సేవల పన్ను విధింపును కేంద్రం సరళీకరించిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలిలో జీఎస్టీ–2019 బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. పన్ను ఎక్కువగా ఉంటే.. ఎగవేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే తమ వాదనను కేంద్రం అంగీకరించిందన్నారు. బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయడం సరికాదని, ధూమపానం చేసేవారి సంఖ్య ను తగ్గించేందుకే భారీగా పన్ను వడ్డించామనే కేం ద్రం వాదన అర్థరహితమన్నారు.
ఉత్తర తెలంగాణ లో సుమారు 5 లక్షల మంది పేదలు బీడీ తయారీపై ఆధారపడి జీవిస్తున్నారని, బీడీలపై భారీ పన్ను వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందంటూ సభ్యుడు రాజేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిచ్చారు. పెట్రోలియం, మద్యం అమ్మకాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, తద్వారా ధరల నియంత్రణ సాధ్యపడుతుందని మజ్లిస్ ఎమ్మెల్సీ జాఫ్రీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గిందని, భారీగా ఆదాయం సమకూరుతుందని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ టాక్స్ అని, రైతులు, చిన్న, మధ్యతరగతి ప్రజలపై గుదిబండగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment