లెజెండ్‌ సంగం లక్ష్మీబాయి | Article On Legend Sangam Laxmi Bai | Sakshi
Sakshi News home page

లెజెండ్‌ సంగం లక్ష్మీబాయి

Published Sun, Mar 17 2019 8:55 AM | Last Updated on Mon, Mar 18 2019 10:51 AM

Article On Legend Sangam Laxmi Bai - Sakshi

సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనిత సంగం లక్ష్మీబాయి. సామాజిక సేవకు పూర్తి సమయం వెచ్చించిన మానవతా మూర్తిగా.. బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరగక కృషి చేసి ఆత్మబంధువుగా ఆమె గుర్తింపు పొందారు. ఖద్దరు చీర ధరించి వీసమెత్తు బంగారం కూడా సంపాదించకుండా రాజకీయ విలువలను పెంచిన యోధురాలు. సాదాసీదా జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఎస్‌ఎల్‌ లక్ష్మీబాయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ కావడం విశేషం.

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో లక్ష్మీబాయి జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య. మొదట్లో పెట్టిన పేరు సత్తెమ్మ. పెళ్లయిన తర్వాత అత్తింటి వారు లక్ష్మీబాయిగా మార్చారు. స్కూల్‌ రికార్డులో మేనమామ సంగె సీతారామయ్యయాదవ్‌ ఆమె ఇంటి పేరును సంగం అని రాయించడంతో సంగం లక్ష్మీబాయిగా మారింది. చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు దృష్టిలో పడింది. గుంటూరులోని శారదానికేతన్‌లో చదివించాలన్న ఆయన సలహాతో 1926లో లక్ష్మీబాయిని అక్కడ చేర్పించారు. 1927లో విద్వాన్‌ పాస్‌ అయిన ఆమె ఎనిమిదేళ్లు అక్కడే ఉండి హిందీలో సాహితీ, విదూషీ డిగ్రీలు తీసుకున్నారు. ఆ సమయంలోనే స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

మాతృభూమి విముక్తి కోసం తాను సైతం అంటూ ముందుకొచ్చారు. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1930లో గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. కల్లు, సారా, విదేశీ వçస్త్ర దుకాణాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేసి ఎన్నోసార్లు అరెస్ట్‌ అయ్యారు. జైలులో ఉండి కూడా ఉద్యమ పంథాను కొనసాగించారు. మహిళల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టాలని పోరాడారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఏడాది జైలుశిక్ష అనుభవించారు. 1933లో మద్రాసు వెళ్లన లక్ష్మీబాయి చిత్రకళలో డిప్లొమా పొందారు. ఐదేళ్లు అక్కడే ఉన్న ఆమె 1938లో హైదరాబాద్‌కు వచ్చి గుల్బర్గా బాలికల స్కూల్‌లో డ్రాయింగ్‌ టీచర్‌గా చేరారు. ఆ సమయంలోనే నారాయణగూడలోని రాజ్‌బహుదూర్‌ వెంకట్రాంరెడ్డి ఉమెన్స్‌ కాలేజీ హాస్టల్‌కు గౌరవ వార్డెన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఉద్యోగాన్ని వదిలి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

తెగువ.. సేవ ఆమె సొంతం
షహీద్‌ షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు చంపినప్పుడు ఆయన కుటుంబసభ్యులను పలకరించడానికి ప్రజలు భయపడ్డారు. అయినా.. లక్ష్మీబాయి జంకలేదు. షోయబుల్లాఖాన్‌ ఇంటికెళ్లి అతడి కుటుంబాన్ని ఓదార్చడంతోపాటు ఆదుకున్నారు. దేశంలో హైదరాబాద్‌ విలీనమైన తర్వాత లక్ష్మీబాయి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. 1950లో భూదానోద్యమ యాత్ర కోసం తెలంగాణకు వచ్చిన ఆచార్య వినోబా బావే ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాల భూమిని సేకరించారు. 1952లో సంతోష్‌నగర్‌ చౌరస్తాలో రెండెకరాల్లో ఉన్న సొంత ఇంటిలో స్త్రీ సేవాసదన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు దాన్ని ఐఎస్‌ సదన్‌ అని పిలుస్తున్నారు.

1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు కేబినెట్‌లో డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా 1954 నుంచి 1956 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హయాంలోనే తెలంగాణ జిల్లాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంత్రిగా సంపాదించిన ప్రతి పైసాను స్త్రీ సేవాసదన్‌కు ఉపయోగించారు. 1955లో దాన్ని తన సహచరులైన కేవీ రంగారెడ్డి, ఎ.శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య, ఎం.భోజ్‌రెడ్డితో కలిసి ఇందిరా సేవాసదన్‌గా రిజిస్టర్‌ చేయించారు. అనాథ మహిళలు, శిశువులకు ఉచిత విద్యనందించారు.

‘సదన్‌’లోనే శాశ్వత విశ్రాంతి.. 
ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సంక్షేమ సలహా బోర్డు కోశాధికారిగా, హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధికారిగా, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధికారిగా లక్ష్మీబాయి సమర్థవంతంగా పనిచేశారు. మహిళాభ్యుదయం, సమస్యలపై రేడియో, వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలు ‘నా అనుభవాలు ’ పేరుతో పుస్తకం వెలువరించారు. స్వాతంత్య్ర సమరయోధురాలిగా గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తామ్రపత్రం ఇచ్చి గౌరవించింది. అయితే ఐఎస్‌ సదనం సరైన నిర్వహణ లేక మూతపడింది. జీవితం మొత్తం సదనంతో ముడిపడి ఉన్నందున తనను అక్కడే సమాధి చేయాలన్న లక్ష్మీభాయి చివరి కోరిక నెరవేరింది.

నెహ్రూ, ఇందిర చేయూతతో..
లక్ష్మీబాయి సేవల గురించి తెలుసుకున్న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా వచ్చి సాయం చేశారు. నాటి డిప్యూటీ సీఎం కొండా వెంకటరంగారెడ్డితో పాటు ఇందిరాగాంధీ కూడా సేవా సదనం నిర్వహణకు తోడ్పడ్డారు. రాధికా మెటర్నిటీ హోం, వాసు శిశువిహార్, మాశెట్టి హనుమంతు గుప్త గర్ల్స్‌ హైస్కూల్‌ స్థాపనలో లక్ష్మీబాయిదే కీలకపాత్ర. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డాక 1957లో మెదక్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసిన లక్ష్మీబాయి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆపై 1962, 67లోనూ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 14 ఏళ్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా వ్యవహరించారు. 1972లో ఇందిరా సేవాసదనంలో ఈవెనింగ్‌ కాలేజీగా ఇందిరా ఓరియెంటల్‌ కాలేజీ నడిపి ఎందరో విద్యార్థులకు బంగారు బాట చూపించారు. 1979లో కేన్సర్‌తో చనిపోయే వరకు బాలికలు, స్త్రీ సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశారు.
-కిషోర్‌ పెరుమాండ్ల, మెదక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement