సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి నాలుగేండ్లలో ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల అనైతిక పొత్తును ప్రజలు తిప్పికొడతారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వల్ల ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఏపీలో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీతో పొత్తువల్ల అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, తెలంగాణలో నిండా మునుగుతుందని అన్నారు.
ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఘోర పరాభవం తప్పదని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంతవరకు ఏపీలో రాజధానిని నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయంలో తన గదిలోకి వాననీరు వస్తే ఏమీ చేయలేకపోయారన్నారు. ‘నేను చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా.. నీవు, నీ కొడుకు కలసి హైదరాబాద్‌లో పోటీ చేయండి. మేం కూడా పోరాడుతాం. ఎవరి శక్తి ఏమిటో తేలిపోతుంది. టీడీపీకి మిగిలిన కొంత బలం కూడా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
టీఆర్‌ఎస్ హయాంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. సెటిలర్లు.. ఆంధ్రావాళ్లు అని ఎవరైనా అంటున్నారా? తెలంగాణ ప్రజలుగానే చూశారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. పౌరుల్లో అభద్రత లేదు. మత కలహాలు అసలే లేవు. ఇంకా ఏం కావాలి. టీఆర్‌ఎస్ ఇంకా అభివృద్ధి చేయాల్సింది అని చెప్పగలుగుతామే తప్ప.. ఎలాంటి లోటూ లేదు’అని అన్నారు.
మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం..
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ సీఎంగా కేసీఆరే అవుతారని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదన్నారు. టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, తిరిగి ఆ పార్టీకే అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాకర్షక బలం ముందు ఈ రెండు పార్టీలు ఎదురునిలవలేవన్నారు. ఎంఐఎంకు సీఎం పదవి, ఇతర పదవులపై ఆశలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడంతోపాటు బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టిసారించామని, తమకు మరో లక్ష్యం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఇవీ ఆయన అభిప్రాయాలు..
ఆ ధైర్యం కేసీఆర్‌కే ఉంది..
ప్రజల స్పందనను చూస్తున్నా. ఏ పార్టీ అయినా ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే గుండె ధైర్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్నది. ప్రజల్లో సానుకూలత ఉన్నది కాబట్టే.. తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్తున్నారు. శాసనసభను రద్దుచేయడంతోపాటు వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించారు. మా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టారు. మేం కూడా పోరాడుతాం. మొత్తంగా చూస్తే ప్రజల్లో సీఎం కేసీఆర్‌కు పాపులారిటీ, రేటింగ్ చాలా ఉంది.
టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా..
టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. మరి ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది? చంద్రబాబు మొన్నటివరకు బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. అప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాలేదా? ఆయన బీజేపీని ఎందుకు వదిలేశారు.
సెక్యులరిజం కోసమా? బీజేపీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో ఇక్లాఖ్‌ను చంపినప్పుడు, జునైద్‌ను రైలులో చంపినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం గా ఉన్నారు? గోరక్షణ పేరుతో మైనార్టీలను చంపా రు. దళితులపై దాడులు జరిగినప్పుడు బాబు ఏం చేశారు? అప్పుడు టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ మతకలహాల సమయంలోనూ బాబు కేంద్రంలో బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకున్నారు.
హంగ్ వచ్చే పరిస్థితి లేదు
ఎంఐఎం అధ్యక్షుడిగా నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నా.. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదు. టీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీతోమళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మేం కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌తో కూడా కొట్లాడుతాం.
మా పార్టీ బలాన్ని నిలుపుకోవడంతోపాటు బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మైనార్టీలు, బలహీన వర్గాల సంక్షేమమే మా పార్టీ ప్రధాన ఎజెండా. అందుకే మేం టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాం. ప్రజలు నాలుగున్నరేండ్లపాటు టీఆర్‌ఎస్ పాలనను చూశారు. మంచిగా పనిచేశారనే విశ్వాసం వారిలో ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన బడా నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడమే ఇందుకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment