
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద శనివారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పెద్ద ఎత్తున బలగాలను దింపి పాతబస్తీ వీధుల్లో కవాతు చేపట్టింది. దేశ వ్యాప్తంగా పలు సున్నితమైన ప్రాంతాల్లో ఈ విధంగా బలగాలను అప్రమత్తం చేసింది. అయితే నగరంలో కేవలం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చార్మిచార్ వద్ద మాత్రమే ఎందుకు మార్చ్ నిర్వహించారు. సిక్రింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా కానీ, హైటెక్‌సిటీలో గానీ ఎందుకు చేయట్లేదు’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
కాగా ఢిల్లీలోని చెలరేగిన హింసతో దేశ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణలో ఇప్పటివరకు 42 మందిమృతి చెందారు. సున్నితమైన అంశం అయినందున దేశ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ అప్రమత్తయింది. దీనిలో భాగంగానే ఉత్తర భారతంలోని పలుముఖ్య పట్టణాలతో పాటు దక్షిణాదిన సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను అలర్ట్ చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకూడదని భరోసా ఇచ్చేందుకు ఈ మార్చ్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment