సాక్షి, హైదరాబాద్: బీజేపీ-మజ్లిస్‌ల ఆలోచనా ధోరణి ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొన్న ఆయన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడ్డారు. ప్రసుతం దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా.. అక్కడి ప్రజల్లో ఆందోళన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల గురించి ప్రజలు ప్రశ్నించుకునే స్థితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు బయటకి రావడానికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ-కేసీఆర్-మజ్లీస్‌లు ఒక్కటే
ప్రధాని మోదీ దేశాన్ని విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మజ్లీస్ సిద్దాంతం కూడా అదే కాబట్టి మోదీకి మజ్లీస్ మద్దతు ఇస్తుందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఎంఐఎం మద్దతిచ్చిందని ఆరోపించారు. నోట్ల రద్దు అన్ని వర్గాల ప్రజలకు బాధించిందని పేర్కొన్నారు. ప్రజలందరూ లైన్లలో పడిగాపులు గాశారని, ఆ లైన్లలో నీరవ్ మోదీ కానీ విజయ్ మాల్యాకానీ కనిపించాడా అంటూ ప్రశ్నించారు. దేశంలోని అవినీతిపరుల నల్లధనాన్ని మోదీ తెల్లగా మార్చేశారని ఎద్దేవ చేశారు. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని దేశమంతా చెప్పిందని, అయినప్పటికీ మోదీకి కేసీఆర్ మద్దతు ప్రకటించాడని గుర్తు చేశారు. మోదీకి పార్లమెంటులో మద్దతు తెలిపేది కేవలం కేసీఆరేనని, ఇక్కడ కేసీఆర్‌కు ఎంఐఎం పార్టీ మద్దతుందని తెలిపారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలది కుమ్మక్కు రాజకీయాలని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేవలం ఒకే ఒక కుటుంబం రాజకీయాలను శాసిస్తోందని, వారిని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశం కోసం పోరాడే వారు ముందుండాలి
‘స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంగ్లేయులపై పోరాడిన కాంగ్రెస్ నేతలంతా జైలుకు వెళ్లారు. దేశం కోసం నిలబడేవాడు ముందు ఉండాలి. ప్రస్తుతం దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అందరూ సమానమే ఏ జాతి, ఏ మతం, ఏ ప్రాంతం అయినా ఇక్కడ శాంతిగా జీవించే హక్కు ఉంది. రాజ్యాంగ పరంగా కేవలం హిందుస్తాన్ అయితే చాలు’అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment