ప్రభుత్వంలో చేరేది లేదు..
- మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ స్పష్టీకరణ
- ప్రభుత్వ చిహ్నంగా చార్మినార్ ను గుర్తించాలి..
- కేసీఆర్‌కు అసద్ పలు ప్రతిపాదనలు
సాక్షి,సిటీ బ్యూరో: ఏళ్లుగా పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో తొలిప్రభుత్వంలో చేరబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తాం..తప్ప పదవులపై వ్యామోహం లేదని తేల్చిచెప్పింది. దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. ఈ నేపధ్యంలో గురువారం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్‌ఒవైసీ, అగ్రనేత అక్బరుద్దీన్‌లు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై మహానగరాభివృద్ధిపై తమ ప్రతిపాదనలు ముందుంచారు. ఇదీ మా లెక్కంటూ స్పష్టంచేశారు. ఆ వివరాలు..
నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ చిహ్నంగా చారిత్రక కట్టడమైన చార్మినార్ గుర్తించాలని విజ్ఞప్తి.
ప్రస్తుతం కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీని రద్దు చేసి దానిస్థానంలో పాత ఎంసీహెచ్‌ను పునరుద్ధరించాలి.
నగర శివారు రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రాంతాలను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి.
నగరానికి కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో తీసుకరావాలి.
పాతబస్తీ అభివృద్ధికి 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మంజూరుచేసిన రూ.2,075 కోట్లను విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలి.
నగరంలో విద్యుత్ సమస్యను అధిగ మించేందుకు 440-800 కేవీ సబ్‌స్టేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలి.
ధర్మాస్పత్రి ఉస్మానియాను అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్ కంటే మెరుగ్గా అభివృద్ధి పర్చాలి.
బండ్లగూడలో అందుబాటులో ఉన్న 100 ఎకరాల భూమిని బలహీనవర్గాల వారికి ఇళ్లస్థలాలుగా కేటాయించాలి.
ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరి మైనార్టీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలి.
ముస్లింలు 45 శాతం ఉన్న హైదరాబాద్ జిల్లాలో ముస్లిం అధికారులనే జిల్లా విద్యాశాఖాధికారిగా పోస్టింగ్ ఇవ్వాలి. ఉర్దూ టీచర్ల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి.
మైనార్టీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లింలలో విద్యను అభివృద్ధి చేయాలి.
పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి.