
న్యూఢిల్లీ : బిహార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ చౌదరీపై వేటు పడింది. అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా నేరుగా పార్టీని అశోక్ చౌదరీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చాలా సన్నిహితంగా ఉండే అశోక్ చౌదరీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో బిహార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ భేటీకి అశోక్ చౌదరీని ఆహ్వానించలేదు.
దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా అవసరమైతే తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చీలిక తెస్తానని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ విషయంపై భేటీ అయిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తొలగిస్తే జరగబోవు పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన కోరుకున్నట్లుగానే అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ఓ ప్రకటనల చేశారు. కాగా, చౌదరీ స్పందిస్తూ 'పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి పనిచేశాను. ఇది పార్టీ నిర్ణయం నేను దానిని గౌరవిస్తాను' అని చౌదరీ చెప్పారు. చౌదరీకి మద్దతుగా 18మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏ క్షణంలోనైనా కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చే అవకాశం ఉంది.