పైలట్‌పై వేటు  | Ashok Gehlot Meets Governor Kalraj Mishra | Sakshi
Sakshi News home page

పైలట్‌పై వేటు 

Published Wed, Jul 15 2020 4:09 AM | Last Updated on Wed, Jul 15 2020 8:27 AM

Ashok Gehlot Meets Governor Kalraj Mishra - Sakshi

కొత్త పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌తో గహ్లోత్‌

జైపూర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. పైలట్‌ను రాజస్తాన్‌ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించింది. పైలట్‌కు సన్నిహితులైన ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్‌ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది. జైపూర్‌లో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్‌ తిరుగుబాటు నేపథ్యంలో రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాజస్తాన్‌ సీఎల్పీ సమావేశమైంది. రెండో సారి నిర్వహించిన సీఎల్పీ భేటీకైనా హాజరు కావాలని పైలట్‌ పార్టీ అగ్రనాయకత్వం కోరింది.

సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ స్వయంగా పైలట్‌తో మాట్లాడి తిరుగుబాటు నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. కానీ, వారి అభ్యర్థనలను పైలట్‌ తోసిపుచ్చారు. రెండో సారి నిర్వహించిన సీఎల్పీ భేటీకి హాజరుకావడం పైలట్‌కు ఇచ్చిన సెకండ్‌ చాన్స్‌గా భావించిన పార్టీ.. ఆ సమావేశానికి కూడా పైలట్‌ హాజరు కాకపోవడంతో వేటు తప్పదని నిర్ణయించింది. సీఎల్పీ భేటీ పూర్తి కాగానే, పైలట్‌ను, ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ప్రకటించారు. ‘పైలట్‌కు పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ఎంతో అభిమానించారు. చిన్న వయసులోనే పెద్ద రాజకీయ బాధ్యతను అప్పగించారు.

అయినా, తను, ఇతర మంత్రులు కలిసి బీజేపీ కుట్రలో భాగంగా మారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సూర్జేవాలా ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి, ఓబీసీ వర్గానికి చెందిన గోవింద్‌ సింగ్‌ దొటాసరాను పైలట్‌ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్‌గా నియమించారు. పైలట్‌ అనుచరుడైన ముకేశ్‌ భాస్కర్‌ స్థానంలో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గిరిజన ఎమ్మెల్యే గణేశ్‌ గోగ్రాను నియమించారు. మరోవైపు, పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్ష పదవికి అభిమన్యు పూనియా రాజీనామా చేశారు.  

గవర్నర్‌ను కలిసిన గహ్లోత్‌ 
సీఎల్పీ భేటీ అనంతరం గహ్లోత్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసి.. పైలట్‌ సహా ముగ్గురు మంత్రుల తొలగింపును ఆమోదించాలని కోరారు. పైలట్‌ బీజేపీ చేతిలో పావుగా మారడం దురదృష్టకరమని ఆ తరువాత సీఎం గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌ రాజకీయాల్ని రాజస్తాన్‌లో కూడా పునరావృతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలు సఫలం కాబోవని వ్యాఖ్యానించారు.

‘సచిన్‌ చేతుల్లో కూడా ఏమీ లేదు. ఆయన బీజేపీ చేతుల్లో పావులా మారారు. మొత్తం కథ నడిపిస్తోంది బీజేపీనే’ అన్నారు. కరోనాతో దేశమంతా అల్లకల్లోలమవుతున్న తరుణంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే కుట్రలో బీజేపీ బిజీగా ఉందని విమర్శించారు. పైలట్, మరో ఇద్దరు మంత్రులను తొలగించిన అనంతరం ప్రస్తుతం గహ్లోత్‌ మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది కేబినెట్‌ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మెజారిటీ ఉందని ఊరికే చెప్పడం కాదని, అసెంబ్లీలో నిరూపించుకోవాలని పైలట్‌ వర్గం డిమాండ్‌ చేసింది.

బందీగా ఉన్నట్లుంది 
బీటీపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌కు సంబంధించిన వీడియోలు వెరల్‌ అయ్యాయి. తనను బందీలా ఉంచారని, నియోజకవర్గానికి కూడా వెళ్లనివ్వడం లేదని ఒక వీడియోలో రాజ్‌కుమార్‌ వాపోవడం కనిపిస్తుంది. ఆయన కారు కీస్‌ను ఒక ఎస్సై తీసుకుని వెళ్తుండటం, చుట్టూ పలు పోలీసు వాహనాలు ఉండటం  ఆ వీడియోలో ఉంది. 

పైలట్‌ ట్వీట్‌ 
పైలట్‌ భవిష్యత్‌ కార్యాచరణ స్పష్టం కాలేదు. పైలట్‌ బీజేపీలో చేరబోవడం లేదని అనుయాయులు అంటున్నారు. ప్రభుత్వంలో నాయకత్వ మార్పే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. తనను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ పదవులనుంచి తొలగించడంపై పైలట్‌ స్పందించారు. ‘నిజాన్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు కానీ దానికెన్నడూ ఓటమి ఉండదు’ అని ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో సైతం ఆయన మార్పులు చేశారు. రాష్ట్రంలో తాను నిర్వహించిన పదవుల వివరాలను తొలగించారు. టోంక్‌ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి అని ఉంచారు. మరోవైపు, పైలట్‌ బీజేపీలో చేరాలనుకుంటే.. తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని బీజేపీ నేత ఓం ప్రకాశ్‌ మాథుర్‌ వ్యాఖ్యానించారు.

నంబర్‌ గేమ్‌లో గెలుపెవరిది? 
రాజస్తాన్‌ అధికార కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన నంబర్‌ గేమ్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 107 మంది సభ్యులున్నారు. 72 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. 13 మంది స్వతంత్ర సభ్యులున్నారు. ముగ్గురు ఆర్‌ఎల్‌పీ, ఇద్దరు సీపీఎం, ఇద్దరు బీటీపీ, ఒక ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే ఉన్నారు. మెజారిటీకి అవసరమైన సంఖ్య 101. ఈ సంక్షోభానికి ముందు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నవారు.. 122 మంది
కాంగ్రెస్‌ సభ్యులు: 107
స్వతంత్ర ఎమ్మెల్యేలు: 10
బీటీపీ, సీపీఎం, ఆర్‌ఎల్‌డీ సభ్యులు:  5
సంక్షోభం తర్వాత.. పైలట్‌ పక్షం ఎమ్మెల్యేలు (ఆయన వర్గం వాదన ప్రకారం): 20 మంది 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు: 17
ఇండిపెండెంట్లు: 3

ఈ వాదన ప్రకారం.. గహ్లోత్‌ వైపు ప్రస్తుతం 90 మంది కాంగ్రెస్‌ సభ్యులుంటారు(107 మైనస్‌ 17). వీరు కాకుండా, మారిన పరిస్థితుల్లో ఏడుగురు స్వతంత్రులు మాత్రమే గహ్లోత్‌కు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. దాంతో, గహ్లోత్‌ వైపున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 97 గా మారింది. ఈ నేపథ్యంలో, ఇద్దరు ఆర్‌టీపీ, ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేలు ప్రస్తుతం కీలకంగా మారారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాయి. ముగ్గురు ఆర్‌ఎల్పీ సభ్యుల మద్దతుతో కలుపుకుని బీజేపీ బలం ప్రస్తుతం 75గా ఉంది. 

సీఎల్పీ భేటీకి 18 మంది డుమ్మా 
సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి కూడా పైలట్‌ గైర్హాజరైన విషయం తెలిసిందే. పైలట్‌ మద్దతుదారులైన మరో 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ భేటీకి హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ముఖ్యమంత్రి గహ్లోత్‌ వర్గం మాత్రం ఆ సమావేశానికి 106 మంది ఎమ్మెల్యేలు వచ్చారని పేర్కొంది. తమవైపు 16 ఎమ్మెల్యేలున్న ఒక వీడియోను పైలట్‌ వర్గం విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement