
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ తొలిరోజే నిరసనలతో ఆరంభమైంది. రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రశ్తోత్తరాలు పూర్తయ్యే వరకు పోడియంలోనే బైఠాయించారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డికి సమయం ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కోరినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు.
శుక్రవారం సభ ఆరంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. తాము రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని, దానిపై మొదట చర్చించాలని కాంగ్రెస్ పక్షఉపనేత టి.జీవన్‌రెడ్డి పేర్కొ న్నారు. ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ సభ్యులు సైతం తమ స్థానాల్లోంచి లేచి రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు.
ప్లకార్డులతో నిరసన..
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో కాంగ్రెస్ సభ్యు లంతా పోడియం ముందు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ కోరినా వినిపించుకోలేదు. కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘పత్తి రైతులను ఆదుకోవాలి’, ‘15 శాతం తేమ ఉన్న పత్తిని ప్రభు త్వమే కొనుగోలు చేయాలి’అంటూ నినాదాలు చేశారు.
ఈ సమయంలో సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభలోనే ఉన్నారు. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని డిప్యూటీ స్పీకర్ కోరినా వినకపోవడంతో, ప్రశ్నోత్తరాలు యథావిధిగా కొనసాగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా పోడియం వద్దే కూర్చొని నినా దాలు చేశారు.
ప్రశ్నోత్తరాల మధ్యలో డిప్యూటీ స్పీకర్ మరోమారు కల్పించుకుని సభ్యులు తమ స్థానాల్లో వెళ్లి కూర్చుంటే ప్రతిపక్ష నేతకు మైక్ ఇస్తానని చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. మధ్యలో కొన్ని ప్రశ్నలపై సీఎం సమాధానం ఇచ్చిన సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు.
కొందరే సభను శాసించలేరు
ఎమ్మెల్యే అక్బరుద్దీన్
పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ‘సభా నాయకుడు సభలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నారు. రేపు మరొకరు ఉంటారు. అక్కడ ఎవరున్నా మనం వారిని గౌరవించాలి.
కొందరు సభ్యులు మొత్తం సభను అడ్డుకోవడం సరికాదు. కొద్దిమందే మొత్తం సభను శాసించలేరు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలి’ అని ఆయన పేర్కొన్నారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పినా.. ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్బర్ సూచనను సైతం పట్టించుకోని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం ముగిసి, సభ వాయిదా పడేంత వరకు పోడియం ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ
రైతు సమస్యలపై ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ బీజేపీ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాలు ముగిశాక డిప్యూటీ స్పీకర్ ప్రకటిం చారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment