
శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర .. సాయంత్రం 5గంటలకు అంత్యక్రియలు ఇక్కడ జరగనున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. వాజ్‌పేయి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజ్‌పేయిని కడసారిచూపు చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఢిల్లీకి తరలివస్తున్నారు. వాజ్‌పేయి మరణంతో ఆగస్టు 22వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు.
కాసేపట్లో వాజ్‌పేయి పార్థీవదేహాన్ని కృష్ణమీనన్ మార్గంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. శుక్రవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి.