వాజ్‌పేయి మంచి వక్త. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా ఆయన ప్రసంగం మొదలు పెడితే చాలు పార్లమెంటు సభ్యులందరూ నిశ్శబ్దంగా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యాన్ని పండిస్తూ, కవితా పరిమళాలు వెదజల్లుతూ, విమర్శకుల నోళ్లను మూయిస్తూ, చమత్కారపూరితంగా ఒక గంగా ప్రవాహంలా ఆయన ప్రసంగాలు సాగిపోయేవి. ఆయనలోని సంభాషణాచాతుర్యానికి స్వపక్ష నేతలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా మంత్రముగ్ధులయ్యేవారు.
తొలి ప్రసంగంతోనే నెహ్రూ ఫిదా
1957లో వాజ్‌పేయి పార్లమెంటేరియన్‌గా తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వాజపేయి విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగానికి విస్తుపోయారు. అంత చిన్న వయసులో అపారమైన పరిజ్ఞానంతో మాట్లాడిన వాజ్‌పేయిని ఆకాశానికెత్తేశారు. రాజకీయాల్లో ఆ యువకుడికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఎప్పటికైనా దేశ ప్రధాని అవుతారంటూ అప్పట్లోనే జోస్యం చెప్పారు.
ఆగ్రహావేశాలు ప్రదర్శించగలరు
వాజ్‌పేయి మృదుస్వభావి. ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ సుతిమెత్తగా సాగిపోయేవి. కానీ అవసరమైతే ఆ స్వరం నిప్పులు కూడా కురిపించగలదు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రధాని గా ఉన్న సమయంలో బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై చర్చ జరిగే సమయంలో వాజ్‌పేయి ప్రసంగంలో ఆగ్రహావేశాలు కనిపిస్తాయి. వాజ్‌పేయిలో ఆ కోణాన్ని చూసి సభ యావత్తూ విస్తుపోయింది.
శాంతే ప్రధానం లేదంటే సమరమే
మిత్రులను మార్చుకోవచ్చు, కానీ ఇరుగుపొరుగుని మార్చలేం. మేము శాంతినే కోరుకుంటాం కాదంటారా సమరానికైనా సిద్ధం అంటూ పాక్‌కు రిటార్ట్ ఇచ్చారు. 1998లో పోఖ్రాన్ –2 (ఆపరేషన్ శక్తి) అణు పరీక్షలపై సర్వ త్రా ఆందోళనలు వ్యక్తమైనప్పుడు వాజ్‌పేయి బాగా సమర్థించుకున్నారు. ‘ఇప్పటికే మూడు సార్లు దాడులకు బలయ్యాము. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు. ఒకవైపు లాహోర్ బస్సు సర్వీసు అంటూ ఈ అణుపరీక్షలేమిటని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ రెండూ ఒకే నాణేనికి చెరోవైపులాంటివి. నీతి నిజాయితీతో స్నేహహస్తం జాపాం. తోకజాడిస్తారేమోనని రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’అంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
శ్రమయేవజయతే నినాదం
‘నేను ఓటమిని అంగీకరించను. పోరు బాట పట్టడమే నాకిష్టం. ఆకాశాన్నంటే ఆశయాలను సాధించాలంటే కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా తలవంచకూడదు‘అంటూ వాజపేయి తన ప్రసంగాల్లో శ్రమయేవ జయతే నినాదాన్నే ఎప్పుడూ వినిపించేవారు. కష్టపడి పనిచేస్తేనే బంగారు భవిష్యత్ సాధ్యపడుతుందని ఆయన యువతరానికి పదే పదే పిలుపునిచ్చేవారు. 2002 స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలోనూ మన ముందున్న లక్ష్యం చాలా పెద్దదే కావొచ్చు, కానీ చేయి చేయి కలిపితే, కష్టపడి పోరాడితే విజయం మన ముందు తలవంచుతుంది అంటూ ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపారు.
కొత్త సంబంధాలు
2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసిందనే చెప్పాలి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సుస్థిరతలకు పాటు పడాలని, అన్ని రంగాల్లోనూ సహకరిస్తూ కొత్త అధ్యాయానికి తెరతీయాలంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని అమెరికన్లు ఎప్పటికీ మర్చిపోలేమని అంటారు.
అద్భుతమైన వాదనా పటిమ
వాజ్‌పేయి ఏదైనా అంశంపై మాట్లాడితే ముందస్తుగా సుదీర్ఘమైన కసరత్తు చేసేవారు. రకరకాల గణాంకాలను ప్రస్తావిస్తూ, వాస్తవాలనే మాట్లాడుతూ తన వాదనకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడం ఆయన ప్రసంగాల్లో విలక్షణంగా కనపడేది. అందుకే ఆయన ఆరెస్సెస్‌కి అనుకూలంగా మాట్లాడినా కూడా సభలో ఎలాంటి అలజడి చెలరేగేది కాదు. ఇతర పక్షాల సభ్యులు నోరు మెదపలేకపోయేవారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జెనీవాలో కశ్మీర్ అంశంపై జరిగే చర్చలకు ప్రతిపక్ష నాయకుడైన వాజ్‌పేయిని భారత్ ప్రతినిధిగా పంపించారంటే ఆయనకున్న వాదనాపటిమ ఎంతటిదో, ఇతర పక్ష నేతలూ వాజ్‌పేయి అంటే ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతుంది.
నేటికీ వెంటాడే ప్రసంగం
1996లో 13 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజ్‌పేయి గద్దె దిగిపోతూ మంద్రస్వరంతో నీతి నిజాయితీ ఉట్టిపడేలా చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం అదే తొలిసారి. అప్పట్లో వాజ్‌పేయి సభ విశ్వాసాన్ని పొందలేకపోయినా తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.
‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా? సీట్లు ముఖ్యమా? మన పార్లమెంటరీ వ్యవస్థలో నెగటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఈనాటి రాజకీయాలకు కూడా అద్దం పడుతోంది.
అంతటి వక్తకి నోట మాట రాలేదు..
వాజ్‌పేయి మృదుస్వభావి. వెన్నలాంటి మనసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లా డే ఆయన నోటి వెంట మాటరాని సందర్భం ఒకసారి ఎదురైంది. 1988లో బిహార్‌లోని పరారి యా గ్రామంపై దాడి చేసిన ఖాకీలు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. వెనుకబడిన కులాల ఇళ్లౖ పె దాడులు చేసి వారి సామాన్లను లూటీ చేశారు. మహిళల్ని పాశవికంగా సామూ హిక అత్యాచారం చేశారు.
ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన వాజ్‌పేయి చలించారు. చెవి కమ్మలు, ముక్కెరలు తెగిపోయి రక్తంతో దీనస్థితిలో ఉన్న వారిని చూసి విస్తుపోయారు. నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. కన్నీరు పెట్టుకు న్నారు. బుగ్గల మీద నుంచి జారిపడిన కన్నీటి చారికలతో వాజపేయి చెప్పిన మాట ఒక్కటే. ‘రేపిస్టుల్ని ఉరితీయాలి‘. ఆ ఒక్క మాటతోనే అత్యాచార బాధితులకు కొండంత ఊరట ఇచ్చారు.
ఏకాభిప్రాయంతోనే 3 రాష్ట్రాల ఏర్పాటు
న్యూఢిల్లీ: వాజ్‌పేయి ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారన్నది అందరూ చెప్పేమాట అయితే, 2000 ఏడాదిలో ఆయన ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ. ఆ ఏడాది నవంబర్ 1న మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌ను, అదే నెల 9న ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్‌ను, 15న బిహార్‌ను విభజించి జార్ఖండ్‌ను వాజ్‌పేయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడా ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలోనూ ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆ మూడు రాష్ట్రాలూ ప్రశాంతంగా ఏర్పడ్డాయి’ అన్నారు.
(పెరిగిన పెట్రోలు, కిరోసిన్ ధరలకు నిరసనగా ఎడ్లబండిపై పార్లమెంటు సమావేశాలకు వెళుతున్న వాజ్‌పేయి)
12 సార్లు ఎంపీగా..
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలందించారు. 12 సార్లు పనిచేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో వాజ్‌పేయి ఓడిపోయారు.
రెండు భాషల్లోనూ పట్టు
ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ వాజ్‌పేయి అనర్గళంగా మాట్లాడగలరు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు. ఏ భాషలో మాట్లాడినా హాస్యం, వ్యంగ్యాన్ని విడిచిపెట్టలేదు
వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు
♦ బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది, అడ్వాణీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజపేయి ‘నేను ఏ దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ అవతలి వారి బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను’ అంటూ ఎదురుదాడి చేశారు.
♦కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణం అని పాకిస్తాన్ మంత్రి ఒకరు అంటే దానికి వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం పాకిస్తాన్ లేకుండా హిందూస్తాన్ కూడా అసంపూర్ణమే.
♦ ఒక చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు కదాని పాక్ నేతలు పరోక్షంగా భారత్ కయ్యానికి కాలు దువ్వుతోందని ప్రస్తావిస్తే వాజ్‌పేయి చప్పట్లు కొట్టలేం నిజమే. కానీ చిటికెలు వెయ్యగలం కదా అంటూ పాక్ నోరు మూయించారు.
♦ విపక్షాలు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ, తప్పుడు పార్టీలో మంచి మనిషి అని వ్యాఖ్యానిస్తే, అయితే ఈ మంచి మనిషిని ఏం చేయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.
♦ బిహార్‌లో ఒక సభలో ‘నేను అటల్‌ని. ఒక్క క్షణం ఆగి బిహారిని కూడా ‘అంటూ ప్రసంగాన్ని ప్రారంభించగానే చప్పట్లే చప్పట్లు.
Comments
Please login to add a commentAdd a comment