సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి అవంతి శ్రీవివాస్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చదువుతోనే పేదల జీవితాల్లో మార్పులొస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకంలో తల్లుల ఖాతాల్లో రూ. 6500 కోట్లు జమ చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు పేరుతో కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యా కానుక పేరుతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని గుర్తుచేశారు. (తొలి ఏడాది నుంచే విద్యారంగానికి ప్రాధాన్యత)
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్లో మాత్రమే ఒకటి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అవినీతి రహిత పరిపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. రెండు నెలల తర్వాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడులో ప్రజలని మభ్యపెడుతూ మాడ్లాడారని మండిపడ్డారు. తప్పులు పక్కవాళ్లపైకి తోసేయడం చంద్రబాబుకి అలవాటని దుయ్యబట్టారు. పోలవరం పేరుతో చంద్రబాబు చేసిన అవినీతిని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం పోలవరంపై లెక్కలు అడిగితే బాబు తప్పించుకోలేదా అని ప్రశ్నించారు. బాబు అవినీతి తారస్ధాయికి చేరుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ తెగతెంపులు చేసుకోవడం నిజం కాదా అని అవంతి శ్రీవివాస్ నిలదీశారు. ('ఇంకెక్కడి తెలుగుదేశం.. దూరమై ఏడాదైంది')
అధికారంలో ఉన్న అయిదేళ్లూ చేసిన అక్రమాలు, దారుణాలు మరిచిపోయారా అని మంత్రి అవంతి శ్రీవివాస్ రావు ధ్వజమెత్తారు. మహానాడు ద్వారా ఓటమిపై విశ్లేషించుకుంటే బాగుండేదన్నారు. ఇప్పటికీ మీరు వ్యవస్ధలను మేనేజ్ చేయడం ద్వారా కుట్ర రాజకీయాలకి పాల్పడ్డారని మండిపడ్డారు. సింగపూర్‌లా మారుద్దామనుకున్న అమరావతిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడో విశ్లేషించుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్‌పై, తమ ప్రభుత్వంపై మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రజలు దేశ చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్ధాయిలో 151 సీట్లు తమకు ఎందుకిచ్చారో తెలుసుకోవాలన్నారు.
బాబు చేసిన అక్రమాలు, అవినీతి తట్టుకోలేక ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు కరోనా కష్ట కాలంలో ఉంటే చంద్రబాబు ఎందుకు హైదరాబాద్‌లో ఉండి పోయారని అవంతి శ్రీవివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్పారు. విశాఖలో ఒక్క గజం స్ధలం అవినీతి, భూ కుంభకోణం జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, జరగకపోతే బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేదలకి ఇళ్ల స్ధలాలు ఇస్తుంటే బాబుకు ఎందుకు బాధని అవంతి శ్రీవివాస్ మండిపడడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment