లేఖతో చంద్రబాబు నాటకాలు బట్టబయలు | Babu Wrote Letters To Central About Package | Sakshi
Sakshi News home page

లేఖతో చంద్రబాబు నాటకాలు బట్టబయలు

Published Wed, Mar 27 2019 10:06 AM | Last Updated on Wed, Mar 27 2019 10:35 AM

Babu Wrote Letters To Central About Package - Sakshi

‘ఆయనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సాధారణంగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తారు. కాని సదరు ప్రముఖ వ్యక్తి రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీకి స్వాగతం పలికారు. ప్యాకేజి విధివిధానాలను లేఖల ద్వారా కేంద్రానికి తెలియజేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి ముగ్ధలయ్యారు. కాని ప్రత్యేక హోదా వల్ల వచ్చే అదనపు ప్రయోజనాల గురించి ప్రధాన ప్రతిపక్షం ప్రజలకు బలంగా వినిపించింది. దీంతో ప్యాకేజీ పట్ల ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనలకు భయపడి ధర్మపోరాట దీక్షలంటూ కొత్త నాటకాలకు తెరలేపారు. కాని కేంద్రమంత్రి లేఖలను బయట పెట్టడంతో  సదరు ముఖ్యమంత్రి బండారం బయటపడింది..’

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పారిశ్రామిక రంగం రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహించకపోగా వాటికి ఇచ్చే నిధుల్లో కూడా కోత పెట్టారు.  దీంతో గడచిన ఐదేళ్ల్లలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఉంది.  ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా యూటర్న్‌ తీసుకున్నారో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మంగళవారం బట్టబయలు చేశారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముఖ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి 2016 అక్టోబర్‌ 24న చంద్రబాబు రాసిన పలు లేఖలను ఆయన విడుదల చేశారు. ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎలా సహాయం చేయాలన్న విధానం గురించి కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.

దీంతో చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షల పేరుతో చేస్తున్న నాటకం బట్టబయలు అయ్యింది. హోదా వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని,  కొత్తగా పరిశ్రమలు రావడం వల్ల  మౌలిక సదుపాయాల కల్పన నుంచి, నిర్మాణ పనుల వల్ల బాగా చదువుకున్న వారికే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారికి కూడా ఉపాధి దొరుకుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతూ వచ్చింది. పరిశ్రమల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఉత్పత్తి వల్ల వేలాది మందికి ఉపాధి వస్తుందని, ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఛత్తీస్‌ఘడ్‌నే తీసుకుంటే 60 వేల పరిశ్రమలు వచ్చాయని, అంతకు ముందు ఒక్క పరిశ్రమ కూడా లేదని గుర్తు చేసింది. దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. అయితే ఆ ప్రత్యేక హోదా ఉద్యమాలను అణిచివేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేశారు. ఏలూరులో జగన్‌మోహనరెడ్డి యువభేరి కార్యక్రమం పెడితే దానికి విద్యార్ధులను రానీయకుండా కుట్రలు చేశారు.

జిల్లాలో గడచిన ఐదేళ్లలో ఉపాధి కల్పన శాఖ కూడా ప్రైవేటు కంపెనీలలో మార్కెటింగ్‌ ఉద్యోగాలను మాత్రమే కల్పించింది. ఇక్కడ కూడా వేతనాలు లేక 90 శాతం మంది మళ్లీ ఆ ఉద్యోగాలను మానివేశారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉపాధి కార్యాలయంలో నమోదు చేయించుకున్న వారి లెక్కన చూస్తే 60 వేలకు పైగా  నిరుద్యోగులు ఉంటే, అనధికారికంగా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. జిల్లాలో వనరులు ఎక్కువగా ఉన్నా, వాటిని వినియోగించుకునే పరిశ్రమలే లేవు. ఇది వ్యవసాయ ఆధారిత జిల్లా. 29 మండలాలు డెల్టాతో పాటు 19 మెట్ట మండలాల్లో మెజారిటీ వరి పంట పండిస్తారు. వరి ద్వారా రైస్‌ మిల్లులను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఒక్క తాడేపల్లిగూడెం ఏరియాలోనే  40 వరకూ  రైస్‌ మిల్లులు మూత పడ్డాయి.

మనకు సుద్ద నిల్వలు అపారంగా ఉన్నాయి. దీని ద్వారా సిరామిక్‌ పరిశ్రమలను స్థాపించవచ్చు. బొగ్గు నిల్వలు చింతలపూడి ప్రాంతంలో లభిస్తున్నాయని తేలింది. కనీసం దీనిపై ప్రభుత్వం ఏ మాత్రము దృష్టి కేంద్రీకరించలేదు. జిల్లాలో పండించే చెరకు వల్ల పంచదార పరిశ్రమలను అధికంగా పెంపొందించవచ్చు. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే చాగల్లు సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది.  జీడిమామిడి ఉత్పత్తులు, ఆక్వా రంగంపైనా ధృష్టి కేంద్రీకరించి ఫీడ్‌ యూనిట్లు వంటివి నెలకొల్పవచ్చు. జూట్‌ నగరంగా పేరుగాంచిన ఏలూరులో జూట్‌ మిల్లులపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. 12వేల మందికి ఉపాధి కల్పించే ఏలూరు జూట్‌ మిల్లులు ప్రస్తుతం కేవలం 6వేల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో రూ.7,400 కోట్ల వ్యయంతో 5 మెగా ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

వాటి ద్వారా 12,820 మందికి ఉపాధి అవకాశాలూ వస్తాయంటూ కబుర్లు చెప్పారు. అయితే వాటిలో ఏ ఒక్కటీ నేటికీ పూర్తి కాలేదు. జిల్లాలో లభించే ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలను నెలకొల్పితే మరో లక్షా 50వేల మందికి ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగంలో కల్పించవచ్చు.  కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలతో పాటు రాయితీల కారణంగా పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది. అదేవిధంగా పన్నుల్లో కూడా రాయితీలు వస్తాయి.  జిల్లాలో మచ్చుకైనా భారీ పరిశ్రమలు కనిపిం చడం లేదు. ప్రభుత్వం భారీ పరిశ్రమలు జిల్లాలో స్థాపిస్తామంటూ చెబుతోంది. కానీ ఆ విధమైన ప్రయత్నాలు చేసేందుకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  ఇప్పటికైనా ప్రత్యేక హోదా వస్తే పశ్చిమగోదావరి చివరి స్థానం నుంచి ముందుకు వచ్చే అవకాశంతో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement