బెజవాడ గోపాల్‌రెడ్డి
సాక్షి, కోట: 1955లో తొలిసారిగా నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జిల్లా నుంచి తొలిసారిగా 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. జిల్లాలో 11 నియోజక వర్గాలు కాగా ప్రకాశం జిల్లాతో మూడు ఉమ్మడి నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండెపి, నందిపాడు ఇందులో ఉండేవి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రజాపార్టీ, ప్రజాసొసైటీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ప్రధానమైనవిగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు ఉన్నా ఈ ఎన్నికల్లో కొందరు స్వతంత్రులు ఎన్నికవడం విశేషం.
1955లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 8,89,214 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లూరు, కావలి, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నందిపాడు, కందుకూరు, కొండేపి అసెంబ్లీ స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరిగాయి. వెంకటగిరి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం ఉమ్మడి నియోజకవర్గాలుగా ఉండేవి.
రెండు సార్లు బెడవాడ విజయం
తొలిసాధారణ ఎన్నికల్లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి స్థానాల్లో జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి నెల్లూరులో ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఉదయగిరి నుంచి షేక్ మౌలాసాహెబ్, కందుకూరు నుంచి కొండయ్యచౌదరి, కొండెపి నుంచి చెంచురామానాయుడు వంటి ప్రముఖులు విజయం సాధించారు. నందిపాడు నుంచి వెంకటరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా, కావలి నుంచి బత్తెన రామకృష్ణారెడ్డి ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి స్థానాల్లో ఆరుగురు ఎంపికయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం నుంచి బసవరెడ్డి శంకరయ్య, స్వర్ణ వేమయ్య సీపీఐ తరపున గెలుపొందారు. వెంకటగిరి నుంచి పాదిలేటి వెంకటస్వామి, కమతం షణ్ముగం, గూడూరు నుంచి పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి, మేర్లపాక మునుస్వామి జాతీయ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు..
Comments
Please login to add a commentAdd a comment