న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కోటాలో 100మందికిపైగా చిన్నారులు మృతి చెందిన ఉదంతంలో ప్రియాంకగాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
కోటాలో చిన్నారుల మరణాలపై రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అశోక్ గెహ్లాట్ మొద్దు నిద్ర నటిస్తోందని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాయావతి ట్విటర్‌లో మండిపడ్డారు. ఇది తీవ్ర ఖండనార్హమని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధినాయకత్వం, ముఖ్యంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ ఈ విషయమై మౌనంగా ఉండటం మరింత ఖండనీయమైన అంశమన్నారు. యూపీలో సీఏఏ అల్లర్లలో బాధితుల కుటుంబసభ్యులను కలుస్తున్న మాదిరిగానే కోటాలో పిల్లలను కోల్పోయిన నిరుపేద తల్లులను కలిస్తే బాగుండేది’ అని ఆమె ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే కోటాలో చిన్నారులు చనిపోయారని ఆమె ఆరోపించారు. కోటాలోని బాధితులను కూడా ప్రియాంకగాంధీ పరామర్శించి ఉంటే.. యూపీలో ఆమె పరామర్శ యాత్రలను రాజకీయ అవసరంగా పరిగణించి ఉండేవారు కాదని ఆమె పేర్కొన్నారు. కోటాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత కొద్దిరోజుల్లో 100దాకా నవజాత శిశువులు చనిపోయారని కథనాలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక, ప్రియాంక నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలపడితే.. అది తన ఓటుబ్యాంకును దెబ్బతీసే అవకాశముందనే భయంతోనే మాయావతి ఇటీవలికాలంలో ప్రియాంకను తీవ్రంగా విమర్శిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment