బెంగాల్లో ప్రాంతీయం వర్సెస్‌ జాతీయం | Bengal Versus Nationalism | Sakshi
Sakshi News home page

బెంగాల్లో ప్రాంతీయం వర్సెస్‌ జాతీయం

Published Wed, May 15 2019 3:34 PM | Last Updated on Wed, May 15 2019 3:53 PM

Bengal Versus Nationalism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్‌సభకు జరిగిన ఆరు విడతల పోలింగ్‌ అన్నింటిలోనూ హింసాకాండ చెలరేగింది. మరో ఐదు రోజుల్లో ఆఖరి ఏడో విడత పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం నాడు పాలకపక్ష తృణమూల్‌ కాంగ్రెస్, విపక్ష బీజేపీ–సంఘ్‌ కార్యకర్తల మధ్య మరోసారి హింసాకాండ ప్రజ్వరిల్లింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్డు షో ర్యాలీ కోల్‌కతాలోని సిటీ కాలేజీ గేటు ముందు నుంచి వెళుతుండగా, ‘అమిత్‌ షా గోబ్యాక్‌’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థులు నినాదాలు చేయడంతో గొడవ మొదలయింది. ఈ సందర్భంగా తృణమూల్, ఏబీవీపీ–బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు.

రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు సమీపంలోని విద్యాసాగర్‌ కాలేజీ గేట్లు విరగ్గొట్టుకొని జొరపడ్డారు. కళాశాల ఆవరణలోని సైకిల్‌ మోటార్లను తగులబెట్టి ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాంతో ఇరువర్గాల ఘర్షణ మరింత తీవ్రమైంది. పెద్ద ఎత్తున పోలీసు దళాలు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన విద్యాసాగర్‌ కాలేజీకి వెళ్లి అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసిన చోటు నుంచే ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ఎవరో తెలియని మూర్ఖులని బీజేపీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి వెంట స్థానికులు ఎక్కువగా లేరని, అంతా యూపీ, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌ నుంచి తీసుకొచ్చిన గూండాలు ఉన్నారని ఆరోపించారు. విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చివేసినందుకు తాను అమితా షాను ‘గూండా’గా పిలుస్తానని కూడా అన్నారు.

ఈ విద్యాసాగర్‌ ఎవరు?
పశ్చిమ బెంగాల్‌ పునరుత్థానానికి ప్రధాన కారకుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌. తత్వవేత్త, విద్యావేత్త, రచయిత, కవి. బెంగాలీ భాషకు సరైన అక్షరమాలను సమకూర్చినవారు. అన్ని కులాల బాలబాలికలకు విద్య అందుబాటులో ఉండాలంటూ పలు పాఠశాలలను ఏర్పాటు చేసిన ప్రముఖ సామాజిక వేత్త. 1856లో హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం రావడానికి కూడా ఆయనే కారణం. ఆయన 1820లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాది నుంచి వచ్చిన బీజేపీ నేతలకు ఏం తెలుసు బెంగాల్‌ సంస్కృతి గురించి అంటూ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్న మమతా బెనర్జీకి ఇప్పుడు విగ్రహం విధ్వంసం మరో ఆయుధమైంది. 2021లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ స్థానిక సంస్కృతి పేరుతో బీజేపీని కొట్టాలని చూస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఫొటో మార్పు
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఇప్పటి వరకున్న మమతా బెనర్జీ ఫొటో స్థానంలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ ఫొటోను పెట్టారు. మరోపక్క హింసాకాండకు నిరసనగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్‌ 22వ తేదీన బెంగాల్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెంగాలి కవి రవీంద్ర నాథ్‌ ఠాగోర్‌ భీర్బమ్‌ జిల్లాలో జన్మించారంటూ తప్పుగా మాట్లాడారు. ఠాగోర్, కోల్‌కతాలో జన్మించిన విషయం తెల్సిందే. బెంగాల్‌ గురించి బీజేపీ నేతలకు ఏమీ తెలియదనడానికి అమిత్‌ షా మాటలే నిదర్శనమని, బెంగాల్‌ ప్రజలను వారు అవమానిస్తున్నారంటూ తృణమూల్‌ నేతలు విరుచుకుపడ్డారు. బెంగాల్‌ ‘కంగాల్‌’ అంటూ అమిత్‌ షా వ్యాఖ్యలపై కూడా వారు మండిపడ్డారు. బెంగాల్‌కు అనుకూలంగా ఓటేస్తారో, వ్యతిరేకంగా ఓటేస్తారో తేల్చుకోండంటూ మొదటిసారి ఓటర్లకు పిలుపునిస్తూ ఓ పాఠను కూడా ప్రచారంలో పెట్టారు.

బీజేపీ ‘జై శ్రీరామ్‌’ నినాదాలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ ఎన్నికల సభల్లో ఎక్కువగా దుర్గా దేవీ గురించి, దుర్గా పూజ గురించి ప్రస్తావిస్తున్నారు. బీజేపీ జాతీయవాదం, మమతా బెంగాల్‌వాదం విజయం సాధిస్తుందో చూడాలి. ఏడవ విడత కింద మే 19వ తేదీన కోల్‌కతాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఈ రెండు పట్టణం సీట్లు అవడం వల్ల, ఎక్కువ మంది మధ్యతరగతికి చెందిన ప్రజలు ఉండడం వల్ల ఈ రెండు సీట్లలో మమత ప్లాన్‌ విజయవంతం కావచ్చు. యూపీలో నష్టపోతున్న సీట్ల స్థానంలో బెంగాల్‌లో 42కుగాను 23 సీట్లను దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement